Let's talk: editor@tmv.in
ఫిడే వరల్డ్ కప్‌లో దీప్తాయన్ ఘోష్ సంచలనం

ఫిడే వరల్డ్ కప్‌లో దీప్తాయన్ ఘోష్ సంచలనం

Shaik Mohammad Shaffee
6 నవంబర్, 2025

ఫిడే ప్రపంచ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ దీప్తాయన్ ఘోష్ సంచలనం సృష్టించారు. రష్యాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌షిప్, ప్రత్యర్థి ఇయాన్ నెపోమ్నియాచిని రెండో రౌండ్ రెండో గేమ్‌లో ఓడించి టోర్నమెంట్ నుండి ఔట్ చేశారు.

ఇది పూర్తిగా ఒకవైపుగా సాగిన గేమ్. తెలుపు పావులతో ఆడిన నెపోమ్నియాచి పొరపాట్లు చేయగా, ఘోష్ అతడికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ప్రారంభంలో అనిశ్చిత స్థితి ఉన్నప్పటికీ, మధ్య ఆట ప్రారంభంలోనే నెపోమ్నియాచి ఒక సింపుల్ టాక్టిక్‌ను కోల్పోవడం ఘోష్‌కు ఒక పావును సంపాదించి పెట్టింది. ఆ తర్వాత టెక్నికల్ దశకు చేరుకున్నప్పుడు ఘోష్ అద్భుతంగా ఆడి, క్రమంగా ఒత్తిడిని పెంచుతూ, పావులు మారుస్తూ చివరికి రూక్, పావుల ఎండ్గేమ్‌లో విజయాన్ని సాధించాడు. విజయం తర్వాత ఘోష్ మాట్లాడుతూ "ఇది నా చెస్ కెరీర్‌లో అతిపెద్ద విజయం. నెపోను ఓడించడం ఎంతో ప్రత్యేకం" అని అన్నారు.

అంతకుముందు గ్రాండ్‌మాస్టర్ పి. హరికృష్ణ రష్యాకు చెందిన ఆర్సెనియ్ నెస్టెరోవ్‌ను చిత్తు చేసి మూడో రౌండ్‌కు చేరుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు. ఇక ప్రపంచ జూనియర్ ఛాంపియన్ వి.ప్రణవ్ నార్వే ఆటగాడు ఆర్యన్ టారీ చేతిలో ఓటమి పాలయ్యాడు. మొదటి గేమ్‌లో నల్ల పావులతో గెలిచి ఆధిక్యంలో ఉన్నప్పటికీ, రెండో గేమ్‌లో ఓటమి పాలవడంతో వీరిద్దరూ టైబ్రేక్ ఆడనున్నారు.

భారత అగ్రరేటెడ్ ఆటగాడు అర్జున్ ఎరిగైసి బల్గేరియాకు చెందిన మార్టిన్ పెట్రోవ్‌పై రెండో వరుస విజయాన్ని సాధించి చివరి 64 దశకు ప్రవేశించాడు. ప్రారంభం నుంచే అర్జున్ ఆధిపత్యం చూపించాడు. పెట్రోవ్ ఎక్కువ సమయం ఆలోచనలో గడిపినా ఫలితం లేకుండా చివరికి పావు కోల్పోయి ఓడిపోయాడు. ప్రపంచ చాంపియన్ డి. గుకేష్ కూడా కజకిస్థాన్‌కు చెందిన నోగెర్‌బెక్ కజిబెక్‌పై విజయం సాధించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. నల్ల పావులతో ఆడిన గుకేష్ మధ్యభాగం నుంచే ఆధిపత్యం ప్రదర్శించాడు.

ఆస్ట్రేలియాకు చెందిన తెమూర్ కుయ్‌బొకరోవ్‌తో జరిగిన రెండో గేమ్‌లో కూడా డ్రా చేసుకున్న ఆర్. ప్రజ్ఞానంద ఇప్పుడు టైబ్రేకర్ ఆడాల్సి ఉంది. నలుపు పావులతో పిర్క్ డిఫెన్స్ ఎంచుకోవడం ద్వారా ప్రజ్ఞానంద గెలవాలనే తన ఉద్దేశాన్ని చూపించినప్పటికీ, కుయ్‌బొకరోవ్ జాగ్రత్తగా ఆడి 46 ఎత్తుల తర్వాత డ్రాకు అంగీకరించారు. భారత్ తరఫున విదిత్ సంతోష్ గుజరాతీ, మురళి కార్తికేయన్, ఎస్.ఎల్. నారాయణన్, రౌనక్ సాధ్వానిలు కూడా రెండో గేమ్‌లో డ్రా చేసుకుని టైబ్రేకర్ కోసం సిద్ధమయ్యారు.

నిష్క్రమించిన ఆటగాళ్లు

సూర్య శేఖర్ గంగూలీ ఫ్రాన్స్‌కు చెందిన మాగ్జిమ్ వాచియర్-లగ్రేవ్ చేతిలో, అరోణ్యక్ ఘోష్ యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన లెవాన్ అరోనియన్ చేతిలో ఒకే విధంగా 0.5-1.5 తేడాతో ఓడిపోయి టోర్నమెంట్‌లో తమ ప్రయాణాన్ని ముగించారు.