
ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ వికాస్ కుమార్ సఖారే అరెస్ట్
తెలంగాణలో సంచలనంగా మారిన భారీ పెట్టుబడి మోసం కేసులో సిఐడి కీ లక అడుగు వేసింది. ఫాల్కన్ గ్రూప్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వికాస్ కుమార్ సఖారెను బుధవారం అరెస్టు చేసింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అతడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి కోర్టు ఆదేశాలమేరకు కస్టడీకి పంపించారు.
దేశవ్యాప్తంగా 7,000 మందికిపైగా అమాయక పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.4,215 కోట్లను వసూలు చేసిన భారీ మోసంలో సఖారే కీలక పాత్ర పోషించాడని సిఐడి అధికారులు తెలిపారు. నిందితుడిని హైదరాబాద్‌లోని హైదరాశకోట్‌లో ఉన్న అతడి నివాసంలో అరెస్టు చేశారు. ఫాల్కన్ గ్రూప్ పేరుతో ప్రజలను ఆకర్షించి, అధిక లాభాలు ఇస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేసినట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
ఫాల్కన్ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థ కాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రై వేట్ లిమిటెడ్ ద్వారా 4,065 మంది బాధితులను రూ.792 కోట్ల మేరకు మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఈ స్కామ్‌లో ఫాల్కన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌దీప్ కుమార్‌తో పాటు ఇతరులతో కలిసి సఖారే కుట్ర పన్నినట్టు సిఐడి పేర్కొంది.
నిందితులు “ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్”ను రూపొందించి మోసానికి పాల్పడ్డారు. గూగుల్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో విస్తృత ప్రచారం చేసి, టెలిమార్కెటింగ్ ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించారు. ప్రముఖ బహుళజాతి కంపెనీల పేర్లతో నకిలీ డీల్స్ సృష్టించి, అధికారికంగా కనిపించే రసీదులు, ఒప్పందాలు జారీ చేసి వ్యాపారం నిజమైనదన్న భ్రమ కలిగించారు.
ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్‌లో మొదట నమోదైన మూడు కేసులను సిఐడికి బదిలీ చేశారు. అదనంగా, దేశవ్యాప్తంగా కంపెనీపై మరో 10 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సిఐడి అదనపు డీజీపీ చారు సిన్హా ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, “అసాధ్యమైన లాభాలు” వాగ్దానం చేసే ఆన్‌లైన్ పెట్టుబడి పథకాలను నమ్మవద్దని సూచించారు. ఆన్‌లైన్ ప్రకటనలు, నకిలీ డీల్స్ ద్వారా వేలాది మందిని మోసం చేసే ఇలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐడి హెచ్చరించింది.
కాగా, ఈ కేసుకు సంబందించి ఇప్పటికే ఫాల్కన్ పెట్టుబడి పోన్జీ స్కీమ్ ప్రధాన నిందితుడు అమర్ దీప్ కుమార్‌ను, తెలంగాణ పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ ఆధారంగా ఇరాన్ నుంచి వచ్చిన వెంటనే ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు జనవరిలో అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపించారు.
