
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ ఛార్జిషీట్.. ఏ1గా కేటీఆర్
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ఏ1) ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. సోమవారం దాఖలైన ఈ చార్జ్ షీట్‌లో ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి సహా మరికొందరిని కూడా నిందితులుగా చేర్చారు.
ఈ కేసు 2024లో నిర్వహించాల్సిన ఫార్ములా ఈ-కార్ రేస్‌కు సంబంధించి సుమారు రూ.55 కోట్ల చెల్లింపులలో జరిగిన అక్రమాలపై దర్యాప్తుకు సంబంధించినది. ముఖ్యంగా విదేశీ కరెన్సీలో ఈ మొత్తాన్ని చెల్లించడం, నిర్దేశిత విధానాలను ఉల్లంఘించడంపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఫార్ములా ఈ రేస్ తొలి ఎడిషన్ 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగింది. రెండో ఎడిషన్‌ను 2024లో నిర్వహించాల్సి ఉండగా, డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దానిని రద్దు చేసింది.
ఇక, ఈ కేసులో 2024 డిసెంబర్‌లో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ ఈ క్రమంలో నిధుల దుర్వినియోగం, నమ్మకద్రోహం, కుట్రపూరిత చర్యలకు పాల్పడినట్లు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద గతేడాది డిసెంబర్‌లో కేసు నమోదైంది. కేటీఆర్‌పై విచారణకు గత గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గతేడాది నవంబర్‌లో అనుమతి ఇవ్వగా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై విచారణకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలను కేటీఆర్ మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచేందుకే నిధులు బదిలీ చేశామని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం పంపిన నిధులు నిర్వాహకుల వద్దే ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎవరికీ లాభం చేకూరలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఛార్జ్‌షీట్ దాఖలు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం మరింత వేడెక్కింది.
