Let's talk: editor@tmv.in
ఫార్ములా-ఈ రేస్ కేసు..రూ. 49 కోట్ల బ్యాంక్ నిధుల బదిలీ ఒక కుంభకోణమా? కేటీఆర్

ఫార్ములా-ఈ రేస్ కేసు..రూ. 49 కోట్ల బ్యాంక్ నిధుల బదిలీ ఒక కుంభకోణమా? కేటీఆర్

Gaddamidi Naveen
26 మార్చి, 2026

తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా-ఈ రేస్ కేసు వ్యవహారం మరోసారి సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం నాంప‌ల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దీనిపై కేటీఆర్ బుధవారం ఘాటుగా స్పందించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో స్పందిస్తూ. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఫార్ములా-ఈ రేసింగ్ మ్యాప్‌లో ఉంచడానికి జరిగిన రూ. 49 కోట్ల బ్యాంక్-టు-బ్యాంక్ నిధుల బదిలీని ప్రభుత్వం 'స్కామ్'గా చిత్రీకరించాలని చూస్తోందా? అని కేటీఆర్ నిలదీశారు. రెండున్నరేళ్లుగా అధికారంలో ఉండి, అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు మీ చేతిలో ఉన్నా.. కేవలం ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు మారిన నిధులపైనే కేసు వేయగలిగారా? ఇది మీ అసహనానికి నిదర్శనం అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈ ఏసీబీ చార్జ్‌షీట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్పష్టమైన నిరాశ నిదర్శనం మాత్రమే కాదు.. మా బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన నిష్కళంకమైన పాలనకు ఒక నిరుపమానమైన సర్టిఫికేట్. బీఆర్ఎస్ హయాంలో ఒక్కటంటే ఒక్క నిబంధన కూడా ఉల్లంఘించబడలేదని ఈ చార్జ్‌షీట్ స్పష్టం చేస్తోంది. మేము కేవలం అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టి ప్రభుత్వం నడిపామని పేర్కొన్నారు.

2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో మొదటి ఫార్ములా-ఈ రేస్ జరిగింది. అయితే, 2024లో జరగాల్సిన రెండో ఎడిషన్ కోసం సుమారు రూ. 55 కోట్ల చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని ఏసీబీ ఆరోపిస్తోంది. కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి, మరో ఇద్దరిపై ఛార్జ్‌షీట్ నమోదైంది. నిర్ణీత విధానాలను పక్కన పెట్టి, అధిక మొత్తంలో విదేశీ కరెన్సీ రూపంలో చెల్లింపులు చేశారని ఏసీబీ పేర్కొంది. క్రిమినల్ దుర్వినియోగం, విధి నిర్వహణలో వైఫల్యం, నమ్మకద్రోహం, కుట్ర వంటి సెక్షన్ల కింద 2024 డిసెంబర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2024లో జరగాల్సిన రేస్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, ఎక్కడా ఒక్క నిబంధనను కూడా ఉల్లంఘించలేదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ ఛార్జ్‌షీట్ దాఖలుతో తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం మరింత ముదిరింది.

ఫార్ములా-ఈ రేస్ కేసు..రూ. 49 కోట్ల బ్యాంక్ నిధుల బదిలీ ఒక కుంభకోణమా? కేటీఆర్ - Tholi Paluku