
ఫలోడి–తెలంగాణ బస్సు దుర్ఘటనలపై సుమోటో గా కేసు స్వీకరించిన సుప్రీం కోర్టు
దేశంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీం కోర్టు సీరియస్‌గా స్పందించింది. రాజస్థాన్‌లోని ఫలోడిలో యాత్రికులను తీసుకువెళ్తున్న టెంపో నిలిచివున్న లారీని ఢీకొని 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనతో పాటు, ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్–బీజాపూర్ హైవేపై జరిగిన చేవెళ్ల బస్సు ప్రమాదం (19 మంది మృతి) పై సుప్రీం కోర్టు సుమోటో కేసు నమోదు చేసింది.
జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ బిష్ణోయి లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి జాతీయ రహదారి ప్రాధికార సంస్థ నుంచి సమగ్ర నివేదిక కోరింది. హైవేలపై ధాబాలు ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రజలు, లారీలు వాటి వద్ద ఆగి రోడ్డు పక్కన వాహనాలు నిలిపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు కొనసాగుతోంది? అని కోర్టు ప్రశ్నించింది. టోల్ వసూలు చేస్తున్నప్పటికీ రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రహదారుల దుస్థితి, నిర్మాణ నిబంధనల ఉల్లంఘనే ఈ దుర్ఘటనలకు కారణమని కోర్టు గమనించింది. రెండు వారాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 33 ప్రాణాలు పోయాయి. ఇది చాలా తీవ్రమైన విషయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్‌హెచ్‌ఏఐ రోడ్ల పరిస్థితిపై, హైవేల వెంట దాబాల ఏర్పాటు వెనుక ఉన్న కారణాలపై తక్షణ నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
సుమోటో కేసులు..
సుమోటో అంటే స్వయంగా కోర్టు చర్య తీసుకోవడం. అంటే ఎవరైనా ఫిర్యాదు చేయకపోయినా, ఎవరూ పిటిషన్ వేయకపోయినా, కోర్టు తానే ఒక విషయాన్ని గమనించి దానిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిస్తుంది. సుప్రీం కోర్టు ఆదేశాలు ‘చట్టబద్ధంగా బైండింగ్’ఉంటాయి.
అంటే, ప్రభుత్వం కానీ, అధికార సంస్థ కానీ, ఆ ఆదేశాలను తప్పక అమలు చేయాలి. ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 141,144 ప్రకారం తప్పనిసరి
ఆర్టికల్ 141: సుప్రీం కోర్టు తీర్పులు దేశంలోని అన్ని కోర్టులకు తప్పనిసరిగా అనుసరణీయమైనవి.
ఆర్టికల్ 144: దేశంలోని అన్ని సివిల్, జ్యుడీషియల్, ఎగ్జిక్యూటివ్ అధికారులు సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలి.
వాస్తవానికి, అన్ని ప్రభుత్వాలు వెంటనే లేదా పూర్తి స్థాయిలో కోర్టు సూచనలు పాటించవు. ఘటన పెద్దది అయితే లేదా ప్రజల్లో కోపం ఎక్కువైతే వెంటనే చర్యలు తీసుకుంటారు. చాలా సార్లు ప్రభుత్వ శాఖలు నివేదికలు సమర్పించడంలో ఆలస్యం చేస్తాయి, లేదా అర్ధసత్య నివేదికలు ఇస్తాయి. కోర్టు చెప్పిన ప్రతిదీ కాకుండా, కొంతవరకు మాత్రమే అమలు చేస్తారు. కోర్టు తిరిగి ఆ ఫైల్‌ను తెరిచి ‘ఎందుకు అమలు కాలేదు?’ అని ప్రశ్నించాల్సి వస్తుంది.
ఇంతకుముందు తీసుకున్న ముఖ్యమైన ‘సుమోటో’ కేసులు
2012
ఢిల్లీలో జరిగిన నిర్భయ రేప్ కేసు, సుప్రీం కోర్టు, హైకోర్టులు కఠిన చట్టాలపై ఒత్తిడి తెచ్చాయి. పోక్సో, క్రిమినల్ లా సవరణలు.
2018
కథువా మర్డర్ కేసు, వేగవంతమైన విచారణకు మార్గం సుగమం, ట్రయల్ కోర్టు పర్యవేక్షణ.
2020 కోవిడ్–19 వలస కార్మికుల సమస్య,ఆహారం, ప్రయాణం, ఆశ్రయం కల్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు.
2021
ఆక్సిజన్ సరఫరా లోపం (కోవిడ్ సెకండ్ వేవ్)కేంద్రం–రాష్ట్రాల సమన్వయంపై పర్యవేక్షణ.
2022
హైవే సేఫ్టీ, ఎన్‌హెచ్‌ఏఐ నిర్లక్ష్యం రోడ్లపై సేఫ్టీ ఆడిట్‌లు చేయాలని ఆదేశం.
2024
మణిపూర్ హింస కేసు–కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయమని ఆదేశించింది.
