Let's talk: editor@tmv.in
ఫలితాలే లక్ష్యంగా పాలన… సాంకేతికతతో సమగ్ర మార్పు

ఫలితాలే లక్ష్యంగా పాలన… సాంకేతికతతో సమగ్ర మార్పు

Panthagani Anusha
19 డిసెంబర్, 2025

రాష్ట్రాభివృద్ధి అనేది మాటలకే పరిమితం కాకుండా ప్రజలకు స్పష్టంగా కనిపించే ఫలితాలుగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ‘ముస్తాబు’ వ్యక్తిగత పరిశుభ్రత కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో అమలు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఆర్థిక భారమేమీ లేకుండా సమాజంలో విస్తృత మార్పు తీసుకొచ్చే ఇటువంటి కార్యక్రమాలే ప్రజల జీవితాల్లో నిజమైన ఫలితాలు చూపుతాయని తెలిపారు. 12వ తరగతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని, వారి ద్వారా రెండు కోట్ల మందికిపైగా ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెరుగుతుందని వివరించారు.

అదేవిదంగా అగ్రిటెక్, లాజిస్టిక్స్, ఇంధన నిర్వహణ, ప్రొడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్ అంశాలతో పాటు పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనపై నిర్వహించిన ప్రజెంటేషన్లను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధిదే కీలక పాత్ర పోషిస్తుందని ఇందుకు అనుగుణంగా సంప్రదాయ విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్‌లో కూడా డిగ్రీలు పొందే అవకాశాలు కల్పించాలని తెలిపారు. దీని ద్వారా విద్య–ఉపాధి మధ్య గ్యాప్ తగ్గుతుంది. అయితే పరిశ్రమలు, టూరిజం, ఐటీ సహా ప్రతి శాఖ ఎంత మంది యువతకు ఉద్యోగాలు కల్పించింది అన్నదే పనితీరుకు ప్రమాణమని స్పష్టం చేశారు.

యువగళం–ఉపాధి లక్ష్యాలు

‘యువగళం’ కార్యక్రమం ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని ఇప్పటివరకు 4.5 లక్షల మందికి ఉపాధి కల్పించగలిగామని సీఎం తెలిపారు. ఈ వివరాలన్నింటినీ డ్యాష్‌బోర్డులో పేర్లతో సహా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

స్వర్ణాంధ్ర@2047 దిశగా

2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనే ప్రభుత్వ విధానమని చంద్రబాబు తెలిపారు. కుటుంబ సాధికారితను కేంద్రంగా చేసుకుని సమీకృత అభివృద్ధి జరగాలని జనాభా నిర్వహణను మరో కీలక అజెండాగా కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు పొందేవారి వివరాలను నమోదు చేసే విధానం తీసుకువస్తామని, ఉగాది నాటికి జనాభా నిర్వహణ పాలసీని ప్రకటిస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర@2047 పది సూత్రాలలో ఒకటైన జనాభా నిర్వహణ ,మానవ వనరుల అభివృద్ధి అంశంపై రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ సమగ్ర పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ముఖ్యమైన అంశాన్ని ఆరోగ్య శాఖతో పాటు స్త్రీ–శిశు సంక్షేమ శాఖలు కలిసి మూడు లైన్ డిపార్టుమెంట్లుగా పర్యవేక్షిస్తున్నాయని ఆయన తెలిపారు.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సగటు వయస్సు ప్రస్తుతం 32.5 సంవత్సరాలుగా ఉండటం ఆందోళనకర విషయమని గౌర్ తెలిపారు. ఇది దేశ సగటు సగటు వయస్సు అయిన 28.4 సంవత్సరాల కంటే ఎక్కువ అని చెప్పారు. దీనివల్ల రాష్ట్రం వేగంగా వృద్ధాప్య దశకు చేరుకుంటోందని, అందుకే పనిచేసే వయస్సు జనాభా వల్ల లభించే ప్రయోజనాల కాలం (డెమోగ్రాఫిక్ విండో) 2040 వరకే ఉంటుందని ఆయన హెచ్చరించారు.

ప్రజారోగ్యంపై సీఎం ఆందోళన

జనాభా నిర్వహణతో పాటు ప్రజారోగ్య సమస్యలపై కూడా సీఎం చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార కల్తీ రాష్ట్రంలో అతిపెద్ద సవాలుగా మారిందని, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులు విస్తరిస్తున్నాయని తెలిపారు. పౌల్ట్రీ రంగంలో వాడుతున్న గ్రోత్ ప్రమోటర్లు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటూ, వాటి వినియోగాన్ని తగ్గించేందుకు జంతు సంవర్థక శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వర్క్‌ఫోర్స్, ఆరోగ్య లక్ష్యాలు

రాష్ట్రంలో వర్క్‌ఫోర్స్ పెరగాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించడానికి ‘కేర్ అండ్ గ్రో యాప్’ ద్వారా 6 ఏళ్ల లోపు పిల్లల్లో లోపాలను ముందుగానే గుర్తించే ప్రక్రియ జరుగుతోందని గుర్తు చేశారు. అదేవిధంగా ‘జీరో సూసైడ్స్’ లక్ష్యంగా పనిచేయాలని, రైతులు, విద్యార్థులు, కుటుంబాలకు కౌన్సిలింగ్‌ను విస్తృతంగా అందించాలని సూచించారు. డ్రగ్స్‌తో పాటు ‘టొబాకో ఫ్రీ’ అంశంపైనా ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సమగ్ర అభివృద్ధి దిశగా

సాంకేతికత, నైపుణ్యాలు, ఉపాధి, ఆరోగ్యం, కుటుంబ సాధికారత కలిగిన సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ తన జిల్లాలో ఫలితాలు కనిపించేలా పనిచేయాలని, డేటా ఆధారిత పాలనతో భవిష్యత్తుకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఫలితాలే లక్ష్యంగా పాలన… సాంకేతికతతో సమగ్ర మార్పు - Tholi Paluku