
ఫిలిప్పీన్స్‌ను హడలెత్తిస్తున్న తుఫాన్
ఫిలిప్పీన్స్ దేశాన్ని ఓ తుఫాన్ అల్లకల్లోలం చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం తైవాన్‌లో కూడా తీవ్రంగా ఉంది. ఈ తుఫాన్‌కు సూపర్ టైఫూన్ రగాసాగా నామకరణం చేశారు. ఫిలిప్పీన్స్ పసిఫిక్ మహాసముద్రంలోని "తైఫూన్ బెల్ట్షలో ఉండటం వల్ల ఇక్కడ తరచూ తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయి. ఈ దేశంలో ప్రతి ఏడాది సగటున 20 తుఫాన్లు వస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో సుమారు ఐదారు తీవ్ర రూపం దాల్చి ప్రజలను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ తుఫాన్లు సాధారణంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎక్కువగా సంభవిస్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా రగాసా అనే తుఫాన్ ఆ దేశ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది.
ఈ ఏడాదిలో ఇదే బలమైన తుఫాన్
ఈ ఏడాది నమోదైన బలమైన తుఫాన్లలో రగాసా అతి పెద్ద తుఫాన్ అని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని గ్రామాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ తుఫాను ఆగ్నేయ చైనా వైపు వెళ్తూ వరదలు, కొండచరియలు కూలే ప్రమాదాన్ని సృష్టిస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో చైనాలో కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చైనాలో తుఫాన్ కొన్ని ప్రాంతాల్లో వరద ముప్పు రావొచ్చని హెచ్చరించారు.
వరదలు, కొండచరియలు కూలే అవకాశం
రగాసా తుఫాను గంటకు 215 కిలోమీటర్ల వేగంతో, 265 కిలోమీటర్ల వరకు గాలి ఉధృతితో విధ్వంసం సృష్టిస్తోంది. కాగయాన్ ప్రావిన్స్ దగ్గర కలయాన్ దీవి తూర్పున ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఇది సోమవారం మధ్యాహ్నం లేదా మధ్యాహ్నం తర్వాత కాగయాన్‌లోని బబుయాన్ దీవుల దగ్గర లేదా దాన్ని దాటి వెళ్లవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగయాన్, బటానెస్, ఇలోకోస్ నోర్టే, ఇలోకోస్ సుర్ ప్రాంతాల్లోని తీరప్రాంతాల్లో 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు గల అలలు రానున్నట్లు హెచ్చరించింది. కలయాన్ దీవిలో, అపయావో ప్రావిన్స్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రగాసాను స్థానికంగా నాండో అని పిలుస్తున్నారు. ఈ తుఫాను వల్ల జరుగుతున్న ఆర్థిక, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ రాజధానితో సహా 29 ఉత్తర లుజాన్ ప్రావిన్స్‌లలో సోమవారం ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని స్థాయిల పాఠశాలలను మూసివేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. కాగయాన్‌లో 8,200 మందికి పైగా, అపయావోలో 1,220 మంది సురక్షిత ఆశ్రయ కేంద్రాలకు తరలిపోయారు. అపయావోలో వరదలు, కొండచరియలు కూలే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఉత్తర ప్రాంతాల్లో దేశీయ విమానాలు రద్దయ్యాయి. తీవ్రమైన సముద్ర గాలుల కారణంగా చేపలు పట్టే పడవలు, దీవుల మధ్య ఫెర్రీలు నిలిచిపోయాయి. ఈ ఘటనతో ఫిలిప్పీన్స్‌లో 14వ సారి వాతావరణ సమస్యలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు స్థానిక ప్రభుత్వ చర్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వరద నియంత్రణ, ప్రాజెక్టుల్లో అవినీతి, నాసిరకం పనులపై విచారణ జరుగుతోంది.
అన్ని శాఖల సమన్వయంతోనే నష్ట నివారణ
తైవాన్‌లో తైటుంగ్, పింగ్‌టుంగ్ కౌంటీలలో తీర, పర్వత ప్రాంతాలతో పాటు ఆర్చిడ్, గ్రీన్ దీవులు మూతపడ్డాయి. తుఫాను హాంకాంగ్, మకావ్ దక్షిణంగా దాటి బుధవారం వరకు దక్షిణ చైనా సముద్రంలో ఉండి, చైనా మెయిన్‌ల్యాండ్‌లో తీరాన్ని తాకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద హెచ్చరికలతో ముందస్తుగా హాంకాంగ్‌లో ప్రజలు ఆహార సరఫరా పెంచుకుంటున్నారు. వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సాధారణం కంటే రెట్టింపు ఇసుక బస్తాలు సిద్ధం చేశారు. మకావ్ పోలీసులు తీరప్రాంత నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. చైనాలో నేటి నుంచి తీవ్ర వర్షాలు, బలమైన గాలులు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జియాంగ్‌మెన్, యాంగ్‌జియాంగ్, జాంగ్‌షాన్, జుహై నగరాల్లో పాఠశాలలు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, రవాణా సేవలు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తూ, అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ముందస్తు చర్యలు చేపడితే ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఉంటుంది.
