
ఫరీదాబాద్‌లో 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
దేశం ఉలిక్కిపడింది. దేశ రాజధానికి అతి సమీపంలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు బయటపడడంతో దిగ్ర్బాంతికి గురయ్యింది. గుట్టుగా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న తీరును చూసి షాక్ తింది. సోమవారం మరోసారి ఉగ్రవాదుల కుట్ర బయటపడింది. పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న పదార్థాలను చూసి ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ఢిల్లీ మొత్తం ఓ అగ్ని పర్వతం పై కూర్చుని ఉంది అన్న మాటలు కలవరం రేపుతున్నాయి. ఎంత స్థాయిలో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారో చెబుతోంది. ఆదివారం ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్, సోమవారం పేలుడు పదార్థాలు స్వాధీనం వరుస సంఘటనలతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. జమ్మూ కశ్మీర్, హర్యానా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఫరీదాబాద్‌లో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 360 కిలోల ఐఈడీ (అమ్మోనియం నైట్రేట్‌గా అనుమానం)తో పాటు ఆయుధాలు, కార్ట్రిడ్జీలు, టైమర్లు, బ్యాటరీలు, వాకీటాకీలు తదితర సామగ్రిని సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ సతేందర్‌కుమార్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ఆర్డీఎక్స్ కాదు. అమ్మోనియం నైట్రేట్‌గా భావిస్తున్నాం. దాదాపు పదిహేను రోజులుగా సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశాం. వారిలో డా. ముజమ్మిల్ అనే వ్యక్తి ఫరీదాబాద్‌లోని అల్–ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యుడిగా పని చేస్తున్నారు. మరో నిందితుడు ఆదిల్ రాథర్‌ను జమ్మూకశ్మీర్‌లోని సహరన్‌పూర్ లో అదుపులోకి తీసుకున్నామని గుప్తా వివరించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఆదిల్ రాథర్ దగ్గర శ్రీనగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లాకర్ నుంచి ఏకే–47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతని నుంచి లభించిన వివరాల ఆధారంగా డా. ముజమ్మిల్‌ను అరెస్ట్ చేసి, ఫరీదాబాద్‌లో పెద్ద మొత్తంలో నిల్వ చేయబడిన పేలుడు పదార్థాలను సీజ్ చేసినట్టు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు
• ఒక అసాల్ట్ రైఫిల్, మూడు మేగజైన్లు, 83 లైవ్ రౌండ్లు
• ఒక పిస్టల్, ఎనిమిది లైవ్ రౌండ్లు
• ఎనిమిది పెద్ద సూట్‌కేసులు, నాలుగు చిన్న సూట్‌కేసులు, ఒక బకెట్
• 20 టైమర్లు బ్యాటరీలతో, 24 రిమోట్లు
• సుమారు 5 కిలోల హెవీ మెటల్, విద్యుత్ వైర్లు, వాకీటాకీలు మొదలైనవి ఉన్నాయి.
స్వాధీనం చేసిన రైఫిల్ ఏకే–47 తరహాలో ఉన్నా, దానికంటే చిన్నదని కమిషనర్ స్పష్టం చేశారు. మొత్తం కేసుపై మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
జమ్మూ, కశ్మీర్ లో
ఆదివారం కుల్గాం జిల్లాలో ఉగ్రవాద మద్దతుదారులపై జమ్ము కశ్మీర్ పోలీసులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదుల ‘ఓవర్‌గ్రౌండ్ వర్కర్లు’ యూఏపీఏ , పీఎస్ఏ కేసుల్లో నిందితులు, చనిపోయిన, యాక్టివ్ టెర్రరిస్టుల బంధువులను లక్ష్యంగా చేసుకుని అనేక ప్రాంతాల్లో కుల్గాం పోలీసులు కర్ఫ్యూ తరహా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విచారణ కోసం అనేక మందిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇళ్లపై సోదాలు నిర్వహించి డిజిటల్ పరికరాలు, అనుమానాస్పద పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. టెర్రర్ నెట్‌వర్క్‌పై ‘జీరో టాలరెన్స్’ విధానంతో కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని కుల్గాం పోలీసులు స్పష్టం చేశారు. గత వారం కూడా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కార్యకలాపాలు నడిపిస్తున్న జమ్మూకశ్మీర్ నేషనల్స్ ఆపరేటర్ల పై భారీ స్థాయిలో దాడులు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడం, ప్రచార సామగ్రి పంచడం వంటి అంశాల్లో పాల్గోన్న బంధువులు, అనుచరులను అరెస్ట్ చేశారు.
ఇదో హెచ్చరిక: యూపీ మాజీ డీజీపీ విక్రమ్‌సింగ్
హరియాణా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు బయటపడటంపై ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్‌సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ భద్రతా సంస్థలకు ఒక "వేకప్ కాల్" అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉగ్రదాడులను అరికట్టాలంటే భారత గూఢచారి వ్యవస్థలు మరింత అధునాతన స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు.
మూడు క్వింటాళ్ల ఐఈడీ, ఒక ఏకే-47 తుపాకీ స్వాధీనం కావడం మామూలు విషయం కాదన్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ మొత్తం అగ్నిపర్వతంపై కూర్చున్నట్టే. ఇది మేల్కోవాల్సిన సమయం అని ఆయన అన్నారు. ఇది పోలీసులకు, ఇంటెలిజెన్స్ సంస్థలను అభినందించతగ్గ విషయమే అయితే శత్రువు దేశంలోకి చొరబడ్డాడు. మూడు క్వింటాళ్ల పేలుడు పదార్థాలు దేశంలోకి ఎలా వచ్చాయనేది ఆలోచించాల్సిన విషయం. ఇంతటి పేలుడు పదార్థం దొరికిందంటే, దాని విధ్వంసక శక్తి ఎంత ఉంటుందో ఊహించండి అని తెలిపారు.
మన గూఢచారి వ్యవస్థల పని తీరును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. ఎటువంటి అనుమానాస్పద కదలికలు జరిగినా వెంటనే స్పందించాలి. పోలీసులు మరింత ప్రొయాక్టివ్‌గా ఉండాలి అని ఆయన సూచించారు. ఈ ఘటనకు సంబంధించి ఉగ్ర సంస్థ జైష్-ఇ-మహ్మద్‌తో నేరస్థులకు సంబంధం ఉన్నట్లు తెలిపారు. అతడు జైష్-ఇ-మహ్మద్‌కు చెందినవాడు. భారత్ దీన్ని తీవ్రంగా ఎదుర్కోవాల్సిన సమయం . ఈ మాడ్యూల్‌ను నిర్వీర్యం చేసినప్పటికీ, జైషే ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. వారు వైద్యులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులను కూడా స్లీపర్ సెల్స్‌గా ఉపయోగించుకుంటున్నారు అని అన్నారు.
ఐఈడీ ఆర్డీఎక్స్ కాకపోవచ్చు కానీ ఇతర పదార్థాలతో కలిపి పెను విధ్వంసాన్ని సృష్టించే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఈ స్థాయిలో పేలుడు పదార్థాలు దొరకలేదని చెబుతున్నారు.
