
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గతంలో నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు సరైన సమాచారం ఇచ్చారు. దీంతో మిగిలిన ఆరుగురికి తాజాగా స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరితోపాటు ఫిర్యాదుదారులైన బీఆర్ఎస్ నేతలకు సైతం నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్నవారిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై విచారణకు అసెంబ్లీ స్పీకర్ శ్రీకారం చుట్టారు. బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసిన ప్రకారం, ఆ 10 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో గెలిచి అసెంబ్లీకి వచ్చారని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరటం అనేది 10వ షెడ్యూల్ ఉల్లంఘన అని పేర్కొంది. దీంతో పార్టీ వీడిన ఎమ్మెల్యేలు నిర్ణీత గడువులోగా తమ వాదనలు, ఆధారాలతో సహా సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ గతంలో పంపిన నోటీసులకు ఇప్పటికే సమాధానాలు ఇచ్చారు. అయితే వాటికి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్‌రెడ్డికి గత సోమవారం రీజాయిండర్లు అందజేశారు. మరి వీరి మీద స్పీకర్ నిజంగానే చర్యలు తీసుకుంటారా? ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయా? అన్నది వేచి చూడాలి.
