Let's talk: editor@tmv.in
ఫిరాయించినోళ్లకు మంత్రి పదవులు ఇవ్వలేదా?

ఫిరాయించినోళ్లకు మంత్రి పదవులు ఇవ్వలేదా?

Gaddamidi Naveen
20 సెప్టెంబర్, 2025

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పాలనలో మంత్రి పదవులు కూడా ఇచ్చారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో పార్టీ ఫిరాయింపులు తప్పు కానప్పుడు.. కాంగ్రెస్ పాలనలో ఎందుకు తప్పు అవుతాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి అన్నారు. నియోజకవర్గ ప్ర‌జ‌లు తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారని, బీఆర్ఎస్ ఓటమితో తన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించి తాను అందువ‌ల్లే కాంగ్రెస్‌లోకి వెళ్లానని చెప్పారు. ఏడాదిన్నరగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని, దేవాదుల కాల్వలు బాగు చేయాలని సిఎం రేవంత్ రెడ్డిని కోరానని అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి అండగా ఉన్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధుల‌ను తీసుకొస్తానని అన్నారు.

నియోజకవర్గంలోని పలు చోట్లకు గోదావరి జలాలు తీసుకొచ్చామని, కాలువల్లో పూడిక తీయించి మరమ్మతులు చేసి సాగునీరు అందించామని అన్నారు. రేవంత్ రెడ్డి స‌హకారంతో నియోజకవర్గం అభివృద్ది చెందుతోందని అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ ప్ర‌జ‌లతోనే ఉంటాన‌ని, ప్రజల కోసమే పనిచేస్తానని ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి హామీ ఇచ్చారు. అప్పుడు బీఆర్ఎస్‌లో చేరిన వారెవరూ రాజీనామా చేయలేదని, కేసీఆర్‌కు రాజీనామాలు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు.

స్పీకర్ త‌మ‌కు నోటీసులు ఇచ్చార‌ని, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నానని, వారి సమస్యల పరిష్కారమే తమ‌ లక్ష్యమని కడియం స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితం ప్రజల సేవకే అంకితం అని ఆయన స్పష్టం చేశారు.

ఫిరాయించినోళ్లకు మంత్రి పదవులు ఇవ్వలేదా? - Tholi Paluku