
ఫణిగిరి - ఒక అపురూప బౌద్ధ క్షేత్రం
ప్రపంచ పర్యాటకుల సందర్శనే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ టూరిజం ఇటీవల టూరిస్టు ప్రాంతంగా ఫణిగిరి వైపు దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బుద్ధిస్ట్ సర్క్యూట్లో ఫణిగిరిని చేర్చింది. తెలంగాణా ప్రభుత్వం ‘విజన్ 2047’లో భాగంగా కొత్త ప్రణాళికలు రచిస్తుంది.
సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఫణిగిరి బౌద్ధారామం, చరిత్ర, సంస్కృతి పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఫణిగిరి బౌద్ధ ప్రాంతం పాము పడగ కొండగా ప్రసిద్ధి చెందిన ఒక కొండ పైన ఉంది. ఈ కొండ ఆకారం పాము పడగను పోలి ఉండటం వలన దీనికా పేరు వచ్చింది ఈ ఫణిగిరికి రెండువేల ఏళ్ల నాటి ఘనచరిత్ర ఉంది. అలనాటి ఫణిగిరి వైభవాన్ని ఇక్కడ ఉన్న బౌద్ధ అవశేషాల ద్వారా, చైతన్య గృహాల ద్వారా, స్థూపాల ద్వారా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆలయం దర్శించదగినది. ఇక్కడ కట్టడాలన్నీ బలంగా, గట్టిగా ఎంతో ప్రామాణికంగా ఉండేవి. ఈ అపురూపమైన చారిత్రక సంపదను ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రత్యేక కథనం
ఫణిగిరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించిన "టూరిజం విజన్ 2047" ప్రణాళికలో ఫణిగిరి బౌద్ధారామానికి కీలక స్థానం కల్పించింది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా దీనిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని కొండాపూర్, ధూళికట్ట, నేలకొండపల్లి, గాజులబండ వంటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలతో కలిపి ఫణిగిరిని బుద్ధిస్ట్ సర్క్యూట్లో చేర్చారు. పర్యాటకుల సంఖ్యను భారీగా పెంచాలనే లక్ష్యంతో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తించి, వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయనున్నారు.
అంతర్జాతీయ ప్రదర్శనల్లో ఫణిగిరి శిల్పాలు
ఫణిగిరి శిల్పకళా వైభవం సరిహద్దులు దాటింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శనకు ఇక్కడి రెండు అపురూప శిల్పాలు ఎంపికయ్యాయి. వీటి విలువ 2 కోట్లుగా గుర్తించి, వీటి భద్రత దృష్ట్యా ప్రభుత్వం భారీగా ఇన్సూరెన్స్ ప్రీమియంగా 8 లక్షల 50 వేలు చెల్లించింది. ఇంతటి విశిష్టత కలిగిన సంపదను ప్రదర్శనకు పంపడం ఇక్కడి శిల్ప సంపద ప్రాధాన్యతను చాటుతోంది.
గతంలో న్యూయార్క్‌లో జరిగిన బౌద్ధ శిల్పకళా ప్రదర్శనకు కూడా ఫణిగిరి నుండి మూడు విగ్రహాలు ఎంపికయ్యాయి. జాతక కథతో ప్యానల్, ఏనుగు వాహనంపై తోరణ జాతక చక్రం, సింహం వాహనంపై స్వాగత జాతక చక్రాలు ఇందులో ఉన్నాయి. ప్రదర్శన అనంతరం వీటిని ఫణిగిరికి తిరిగి తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు ఫణిగిరి వైభవాన్ని వీక్షించడం విశేషం. ప్రస్తుతం ఇక్కడి శిల్పాలను అంతర్జాతీయ పటంలో చేర్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
అరుదైన ఆరడుగుల బుద్ధ ప్రతిమ
ఫణిగిరి కొండపై జరిపిన తవ్వకాల్లో మూడవ శతాబ్దానికి చెందిన అత్యంత అరుదైన ఆరడుగుల బుద్ధ విగ్రహం లభించింది. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారకముందు నాటి దశను ప్రతిబింబించే ఈ విగ్రహంపై ఉన్న అలంకరణలు. గుర్తులు దేశంలో మరెక్కడా లేని విధంగా ఉండటం విశేషం.
ఈ ఆరడుగుల విగ్రహం సాక్షాత్తూ ఇక్ష్వాకుల కాలం నాటి (క్రీ.శ. 3వ శతాబ్దం) శిల్పకళా వైభవానికి నిదర్శనం. సాధారణంగా మనం చూసే బుద్ధ విగ్రహాలు ప్రశాంతమైన ముఖంతో, సాధారణ వస్త్రధారణతో ఉంటాయి. కానీ, ఈ విగ్రహం సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది 'బుద్ధుడు' కాకముందు ఉన్న 'బోధిసత్వుడి' దశను ప్రతిబింబిస్తుంది. సుమారు ఆరు అడుగుల ఎత్తుతో, గంభీరమైన ముద్రలో ఉన్న ఈ విగ్రహం దేశంలోనే అత్యంత అరుదైనదిగా పురావస్తు శాఖ గుర్తించింది. దీని తయారీలో వాడిన సున్నపురాయి వాడడం జరిగింది. ఈ శిల్పాన్ని శిల్పి చెక్కిన తీరు ఆనాటి శిల్పకళ ఉన్నత ప్రమాణాలను చాటిచెబుతున్నాయి.
ఈ విగ్రహం ప్రధాన ప్రత్యేకత దానిపై ఉన్న ఆభరణాలు, అలంకరణలు. సిద్ధార్థుడు రాజకుమారుడు కావడంతో, అతని హోదాను సూచించే విధంగా తలపాగా, చెవులకు భారీ కుండలాలు, మెడలో హారాలు, చేతులకు కంకణాలను ఈ శిల్పంలో అత్యంత సూక్ష్మంగా చెక్కారు. వస్త్రధారణలో కనిపించే మడతలు, శరీర సౌష్టవం అప్పటి గాంధార, అమరావతి శిల్పకళా రీతుల సమ్మేళనాన్ని గుర్తుచేస్తాయి. భారతదేశంలో మరెక్కడా ఇన్ని అలంకారాలతో కూడిన భారీ బోధిసత్వుని విగ్రహం లభించకపోవడం వల్ల, దీనికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఏర్పడింది. అందుకే దీనిని భద్రపరచడానికి ప్రదర్శించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
చారిత్రక ప్రాముఖ్యత - శ్రీకృష్ణుని తొలి శాసనం
శ్రీ పర్వత, విజయపురిలను పాలించిన ఇక్షాక రాజు ఎహువల శాంతమూలుని 18 వ పాలన కాలానికి సంబంధించిన శాసనాలు ఇక్కడ లభించాయి. ఇంత వరకు ఆ రాజు 11 సంవత్సరాలు మాత్రమే పాలించిన ఆధారాలు లభించగా 18 ఏళ్లు ఆ రాజు పాలించాడని తెలిపే శాసనం ఇక్కడ లభించింది అదే శాసనంలో శ్రీ కృష్ణుని ప్రస్తావన కూడా ఉంది ఇలా కృష్ణుని పేర్కొన్న తొలి శాసనం కూడా ఫణిగిరి దగ్గర దొరకడం మరో ప్రత్యేకత
పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం, శ్రీకృష్ణుని ప్రస్తావన ఉన్న తొలి శాసనం ఫణిగిరిలోనే లభ్యం కావడం ఒక సంచలనం. అలాగే, పదవ రోమన్ చక్రవర్తి సెప్టిమియస్ సెవెరస్ కాలం నాటి బంగారు నాణెం ఇక్కడ దొరకడం చూస్తుంటే, ఒకప్పుడు ఇది అంతర్జాతీయ వాణిజ్య మార్గంలో భాగంగా ఉండేదని అర్థమవుతోంది.దీని బరువు 7.3 గ్రాములు ఉంది.
ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో జరిపిన తవ్వకాల్లో బయల్పడిన శ్రీకృష్ణుని ప్రస్తావన ఉన్న శాసనం చారిత్రక పరిశోధనల్లో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. పురావస్తు శాఖ అధికారుల ప్రకారం, దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణుని పేరును ప్రస్తావించిన అత్యంత పురాతనమైన శాసనాల్లో ఇది ఒకటి.
ఈ శాసనం లభించడం వల్ల ఫణిగిరి కేవలం బౌద్ధ మతానికి మాత్రమే పరిమితం కాకుండా, ఒకప్పుడు సంస్కృతుల సంగమ కేంద్రంగా ఉండేదని అర్థమవుతోంది. సుమారు 2000 ఏళ్ల క్రితం నాటి ఈ శాసనం, భారతీయ ఇతిహాసాల్లోని దైవాల ప్రస్తావన చారిత్రక ఆధారాలతో సహా ఎలా విస్తరించి ఉందో నిరూపిస్తోంది. ఇది దక్షిణ పథంలో బౌద్ధ ధర్మం విరాజిల్లిన కాలంలోనే వైదిక లేదా భాగవత మత ప్రభావం కూడా ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యంగా నిలిచింది. పౌరాణిక గాథలకు చారిత్రక ప్రాధాన్యతను కల్పిస్తూ, పణిగిరిని ప్రపంచ స్థాయి పురావస్తు అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఈ 'కృష్ణ శాసనం' కీలక పాత్ర పోషిస్తోంది.
తపస్సు ముద్రలో బౌద్ధ భిక్షువులు
ప్రాచీన కాలంలో ఉత్తర భారత దేశాన్ని, దక్షిణంతో కలిపే జాతీయ రహదారి ఫణిగిరి మీదుగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఫణిగిరి కొండ ఒకప్పుడు బౌద్ధ భిక్షువుల ప్రధాన తపస్సు కేంద్రంగా విరాజిల్లింది. కొండపై ఉండే అత్యంత ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి ఒడిలో లభించే ఏకాంతం ధ్యానానికి ఎంతో అనువుగా ఉండేవి. చరిత్ర ప్రకారం, భిక్షువులు ఇక్కడి కొండపై గల ఆరామాల్లో నివసిస్తూ, కఠినమైన క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేవారు. వారు ప్రతిరోజూ కొండ దిగువన ప్రవహించే ‘ బీరే వాగు’ వరకు వెళ్లి స్నానాలు ఆచరించి, తిరిగి కొండపైకి చేరుకుని బుద్ధుని స్మరణలో నిమగ్నమయ్యేవారు. ఈ క్రమం వారి శారీరక శుద్ధికి, మానసిక ప్రశాంతతకు నిదర్శనంగా నిలుస్తుంది.
ఇక్కడ లభించిన వివిధ శిల్పాల్లో బుద్ధుడితో పాటు బౌద్ధ భిక్షువుల ధ్యాన భంగిమలు అద్భుతంగా చెక్కబడ్డాయి. ముఖ్యంగా పద్మాసనంలో కూర్చుని, కళ్లు అరమూడ్చి, అంతర్ముఖులై ఉన్న భిక్షువుల విగ్రహాలు ఆనాటి ధ్యాన పద్ధతులను మనకు పరిచయం చేస్తాయి. పురావస్తు ఆధారాల ప్రకారం, ఇక్కడి కొండపై తపస్సు మందిరాలు కూడా బయల్పడ్డాయి. భిక్షువులు కేవలం ధ్యానానికే పరిమితం కాకుండా, దేశ విదేశాల నుండి వచ్చే యాత్రికులకు బుద్ధుని బోధనలను వివరిస్తూ ఫణిగిరిని ఒక గొప్ప విద్యా కేంద్రంగా కూడా తీర్చిదిద్దారు.
2001 నుండి 2013 వరకు జరిపిన తవ్వకాల్లో ఇక్కడ మహాస్తూపాలు, చైత్యగృహాలు, శిల్ప సుందరమైన తోరణాలు, నాణాలు బయల్పడ్డాయి. గౌతమ బుద్ధుని జీవిత విశేషాలను తెలిపే జాతక కథల శిల్పాలు, సున్నపు బొమ్మలు, మట్టి పూసలు ఇక్కడి నాగరికతకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం
తెలంగాణ రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పేరు గాంచినది ఈ మండలంలోని ఫణిగిరి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఇది కాకతీయుల కాలంలో ఎంతో పేరు ప్రతిష్ఠలతో, నిత్య దూపదీప నైవేద్యాలతో విరజిల్లుతూ ఉండేది. ఇక్కడ జాతరలు కూడా నిర్వహించేవారు. చుట్టు ప్రక్కల ఇంత పెద్ద ఆలయం మరోకటి లేదు. ఆలయం చుట్టూ రాతి కట్టడాలు, పెద్ద పెద్ద రాతిస్తంభాలు, కల్యాణమండపం, కోనేరు, ద్వారా పాలకులు, రథం, ఆంజనేయ స్వామి విగ్రహాం, శివలింగం, నాగదేవత,చుట్టూ చెట్లు, పచ్చని ప్రకృతితో అద్భుతంగా ఉంటుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి 150 ఎకరాల స్థలం ఉంది.
జాతీయ రహదారుల అనుసంధానం
ఫణిగిరి అభివృద్ధిలో రహదారుల పాత్ర కీలకం కానుంది. సూర్యాపేట నుండి జనగాం, సిద్ధిపేట మీదుగా వెళ్లే ఎన్.ఎచ్-365B రహదారిని వేములవాడ, కొండగట్టు వంటి క్షేత్రాలకు అనుసంధానించాలని ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ రహదారి అభివృద్ధి జరిగితే పర్యాటకుల రాక మరింత సులభతరం అవుతుంది.
తెలంగాణ టూరిజం కొత్త మైలురాయి
ప్రస్తుతం రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య కోట్లలో ఉండగా, విజన్ 2047 నాటికి దీనిని వందల కోట్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అమరావతి, నేలకొండపల్లి వంటి ప్రసిద్ధ క్షేత్రాల సరసన ఫణిగిరిని నిలబెట్టడం ద్వారా తెలంగాణ పర్యాటక రంగం ప్రపంచ వేదికపై మెరవనుంది.
తెలం గాణలోని 2,100 ఏళ్ల నాటి చారిత్రక వారసత్వ సంపద అయిన ఫణిగిరి బౌద్ధ క్షేత్రం, ఒకప్పుడు పిచ్చిమొక్కలతో నిండిన ఒక సాధారణ గుట్టలా ఉండేది. కానీ నేడు, పాము పడగ ఆకారంలో ఉన్న ఈ కొండ దక్షిణాసియాలోనే అత్యంత ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలలో ఒకటిగా అవతరించడానికి సిద్ధంగా ఉంది.
ఈ బౌద్ధ క్షేత్రంలో మహాస్తూపం, విహారాలు, చైత్యగృహాలు, శిలా స్తంభాలతో కూడిన సభా మంటపాలు, అనేక శాసనాలు లభించాయి. ఇవన్నీ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్రను పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 4వ శతాబ్దానికి చెందిన ఈ ప్రాంతాన్ని సరిగ్గా సంరక్షిస్తే, దీనికి ప్రతిష్టాత్మకమైన యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కే అవకాశం ఉందని నిపుణులు విశ్వసిస్తున్నారు.
ఎలా చేరుకోవాలి?
సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో ఉన్న ఫణిగిరి బౌద్ధారామానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం అత్యంత అనువైనది. హైదరాబాద్ నుంచి ఫణిగిరి సుమారు 110 నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ హైవే (NH 163) మీదుగా భువనగిరి, జనగాం దాటిన తర్వాత సూర్యాపేట వైపు వెళ్లే మార్గంలో నాగారం మండలానికి చేరుకోవచ్చు. సూర్యాపేట నుండి అయితే సుమారు 40 నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్యాపేట నుండి తిరుమలగిరి వెళ్లే బస్సులు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా నాగారం చేరుకుని, అక్కడి నుండి ఫణిగిరికి వెళ్లవచ్చు.
ఫణిగిరికి అత్యంత సమీపంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ జనగాం (సుమారు 35-40 కి.మీ). ఇక్కడి నుండి టాక్సీలు లేదా బస్సుల ద్వారా క్షేత్రానికి చేరుకోవచ్చు. నల్గొండ లేదా సూర్యాపేట సమీప స్టేషన్ల కంటే జనగాం నుండి వెళ్లడం సులభంగా ఉంటుంది. అత్యంత సమీప విమానాశ్రయం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడి నుండి కారు లేదా బస్సులో 3 గంటల్లో ఫణిగిరి చేరుకోవచ్చు.
ఫణిగిరి కొండపైకి చేరుకోవడానికి మెట్లు ఉంటాయి. పర్యాటకులు వెళ్లేటప్పుడు తగినంత మంచినీరు, ఆహారం వెంట తీసుకెళ్లడం మంచిది, ఎందుకంటే కొండపై సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి.
