Let's talk: editor@tmv.in
ఫుడ్ కోర్ట్ తిరిగి ఏర్పాటు చేస్తాం!

ఫుడ్ కోర్ట్ తిరిగి ఏర్పాటు చేస్తాం!

FL - YUGDR
25 సెప్టెంబర్, 2025

నగరంలో తొల‌గించిన వీధి వ్యాపారాలు, ఫుడ్‌ కోర్టు వర్తకుల వ్యాపారాలను తిరిగి ఏర్పాటు చేయిస్తానని జనసేన పార్టీ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఆపరేషన్ లంగ్స్ 2.0 ద్వారా రోడ్డున పడిన వీధి వ్యాపారస్తుల సమస్యను పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా వీధి వ్యాపారుల‌కు వెండర్ కార్డులతో సహా తమ వ్యాపారాలు పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చిరు వర్తులకు వ్యతిరేకం కాదని, స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014కు అనుగుణంగా చట్టబద్ధమైన వ్యాపారాలు చేసుకునేందుకు అండగా ఉంటుందని వంశీకృష్ణ చెప్పారు.

అసెంబ్లీ సమావేశాల్లో వంశీకృష్ణ శ్రీనివాస్‌ నగరంలో ఫుడ్ కోర్ట్, వీధి వ్యాపారాల‌ తొలగింపు చర్యలను ఖండించారు. ఏళ్ల తరబడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవనోపాధి సాగిస్తున్న పేదలు ఒక్కసారిగా తమ వ్యాపారాలను తొలగిస్తే రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ వ్యాపారాన్ని నమ్ముకొని పిల్లల చదువు, ఇతర అవసరాలకు అప్పులు చేసుకుని బ‌తుకుతున్న వారి జీవనశైలిని ప్రజాప్రతినిధిగా అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిరు వ్యాపారుల‌ బ్రతుకులు అథోగతి పాలవకుండా రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి జీవనం మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందే కానీ వ్యతిరేక కార్యకలాపాలకు పూనుకోదని వివరించారు.

ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాయని స్పష్టం చేశారు. వీధి వ్యాపార‌ల‌ తొలగింపుపై ప్రతిపక్ష పార్టీలు చేసేవ‌న్నీ అసత్య ప్రచారాలేనని తిప్పి కొట్టారు. తొలగింపులను భూతంగా చూపి తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. వీధి వ్యాపారస్తుల వ్యాపార బాధ్యత, వారి రక్షణ రాష్ట్ర ప్రభుత్వానిదేన‌నిగుర్తు చేశారు. దీనిపై వీధి వ్యాపారస్తులు ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా ఉండాలని, అసెంబ్లీ సమావేశాలు ముగియగానే తమ వ్యాపారాలను యథావిధిగా నిర్వహించుకునేలా వెండర్ కార్డులు పంపిణీ చేసి రక్షణ కల్పిస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

ఫుడ్ కోర్ట్ తిరిగి ఏర్పాటు చేస్తాం! - Tholi Paluku