Let's talk: editor@tmv.in
ఫడ్నవీస్ కు మిత్రపక్ష ఎమ్మెల్యేలు దగ్గరవుతున్నారు: ఆదిత్యా ఠాక్రే

ఫడ్నవీస్ కు మిత్రపక్ష ఎమ్మెల్యేలు దగ్గరవుతున్నారు: ఆదిత్యా ఠాక్రే

Pinjari Chand
9 డిసెంబర్, 2025

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు మహాయుతి మిత్రపక్షం నుంచి 22 మంది ఎమ్మెల్యేలు చాలా దగ్గరయ్యారని, వారు ఏ క్షణంలోనైనా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని శివసేన (యూబీటీ) శాసనసభ్యుడు ఆదిత్య ఠాక్రే సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ వాదన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వైపు సూచిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ ఆరోపణను సీఎం ఫడ్నవీస్ తోసిపుచ్చారు. షిండే సేన ఇప్పటికే మహాయుతి కూటమిలో భాగమే కదా, అలాంటప్పుడు వారి ఎమ్మెల్యేలను ఏం చేస్తాం అని ఆయన ప్రశ్నించారు. 2022 జూన్‌లో షిండే నేతృత్వంలో తిరుగుబాటు జరిగి శివసేన రెండుగా చీలిపోయింది. దాంతో అప్పటి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది. 2024 జనవరిలో అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ షిండే పార్టీని నిజమైన శివసేనగా గుర్తించారు.

ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీ, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కలిసి అధికార మహాయుతి కూటమిలో ఉంది.ట్రెజరీ బెంచీల్లో ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి చాలా దగ్గరయ్యారు. వాళ్లకు మంచి నిధులు అందుతున్నాయి. వాళ్లు ఇప్పుడు సీఎం ట్యూన్‌కు తగ్గట్టు డాన్స్ చేస్తున్నారని ఆదిత్య ఠాక్రే ఆరోపించారు. తన రాజకీయ ప్రత్యర్థి షిండే పార్టీని మాత్రం ఆయన పేర్కొనలేదు. ఈ 22 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ముంబై వర్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే నాగపూర్‌లోని విధాన్ భవన్ ఆవరణలో విలేకరులతో అన్నారు. (ప్రస్తుతం శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి).ఈ 22 మందిలో ఒకరు తనను తాను ‘వైస్-కెప్టెన్’ అని పిలుచుకుంటారని కూడా ఆదిత్య అన్నారు. ఇది పరిశ్రమల మంత్రి ఉదయ్ సామంత్ వైపు సూచనగానే కనిపిస్తోంది.

గతంలో శివసేన (యూబీటీ) ఉదయ్ సామంత్‌ను రాష్ట్రంలో షిండే, అజిత్ పవార్ తర్వాత మూడో ఉప ముఖ్యమంత్రిగా చేయవచ్చని పార్టీ ఆరోపించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (షిండే గ్రూప్) 57 సీట్లు గెలుచుకుంది.

మిత్రపక్షాలకు అండగా నిలబడతాం: సీఎం

ఆదిత్య ఠాక్రే ఆరోపణలపై స్పందించిన ఫడ్నవీస్ షిండే సేన మా మిత్రపక్షం, నిజమైన శివసేన. మేం అలాంటి రాజకీయాలు చేయం. వాళ్లతో కలిసి నిలబడతాం, వాళ్లు మరింత బలపడేలా చూస్తాం. రాబోయే రోజుల్లో శివసేన, బీజేపీ, మహాయుతి మరింత బలపడతాయని చెప్పారు. శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్ష నేతల నియామకం జాప్యం గురించి కూడా ఆదిత్య మాట్లాడారు. ప్రతిపక్ష నేతలను నియమించడానికి ఎందుకు ప్రభుత్వం భయపడుతోంది? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీ అయిన శివసేన (యూబీటీ) తమ ఎమ్మెల్యే భాస్కర్ జాధవ్‌ను శాసనసభలో ప్రతిపక్ష నేతగా నియమించాలని కోరింది (పార్టీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు). కానీ ఇప్పటివరకు స్పీకర్ నుంచి నిర్ణయం రాలేదు. గతంలో ఎన్నికల్లో ప్రతిపక్షం ఘోర పరాజయం పాలైంది. 288 సీట్ల అసెంబ్లీలో 10 శాతం (29 సీట్లు) గల పార్టీకే ప్రతిపక్ష నేత పదవి దక్కుతుందనే నిబంధన ఉందా అని భాస్కర్ జాధవ్ స్పీకర్‌కు లేఖ రాశారు. శాసన మండలిలో మాజీ ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే (శివసేన యూబీటీ) పదవీ కాలం ఆగస్టులో ముగిసింది. కాంగ్రెస్ తమ ఎమ్మెల్సీ సతేజ్ పాటిల్‌ను శాసన మండలి ప్రతిపక్ష నేతగా నియమించాలని కోరింది. శాసన మండలి చైర్మన్ రాం షిండే ఆదివారం ప్రతిపక్ష నేత నియామకం గురించి ప్రతిపాదన వచ్చింది, సంబంధితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఫడ్నవీస్ కు మిత్రపక్ష ఎమ్మెల్యేలు దగ్గరవుతున్నారు: ఆదిత్యా ఠాక్రే - Tholi Paluku