
‘ఫుట్బాల్ ట్రయల్’లో పాక్ నకిలీ జట్టు!
ఇప్పటికే క్రికెట్ పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ తాజాగా ఫుట్బాల్ రంగంలో మరో వివాదంలో చిక్కుకుంది. ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్లుగా చెప్పుకొని జపాన్కు వెళ్లిన 22 మంది వ్యక్తులను అక్కడి అధికారులు నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలపై డిపోర్ట్ చేశారు. ఈ వ్యక్తులు సియాల్కోట్ ఎయిర్పోర్ట్ నుంచి ఓ ఫుట్బాల్ క్లబ్ పేరుతో ప్రయాణించారని పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్ఐఏ పేర్కొంది. కానీ, జపాన్ అధికారులు వారి పత్రాల్లో అనేక అనుమానాస్పద విషయాలను గుర్తించి, వెంటనే వారందరిని వెనక్కి పంపించారు. దీనిని అధికారులు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుగా పరిగణించి పరిశీలన చేస్తున్నారు.
ఈ ఘటన వెనుక మాలిక్ వక్వాస్ అనే వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అతను గోల్డెన్ ఫుట్బాల్ ట్రయల్ అనే నకిలీ క్లబ్ను నమోదు చేసి, అందరికీ నమ్మకం కల్పించేలా ఏర్పాట్లు చేశాడు. ప్రొఫెషనల్ ఆటగాళ్లలా ఎలా ప్రవర్తించాలో కూడా ఈ వ్యక్తులకు శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరి కోసం పాకిస్తాన్ కరెన్సీలో సుమారు నాలుగు మిలియన్ల వరకు వసూలు చేశాడని అధికారులు తెలిపారు. విచారణలో ఇదే పద్ధతిని ఉపయోగించి గతంలో మరొక ఫేక్ జట్టును జపాన్కు పంపించినట్లు వక్వాస్ అంగీకరించాడు. ఇప్పటికే ఆసియా కప్లో పాకిస్తాన్కు ఎదురైన ఓటమి, భారత్తో జరిగిన ‘హ్యాండ్షేక్ వివాదం’ వంటి ఘటనలతో దేశంలో క్రీడా వాతావరణం దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ ఫుట్బాల్ స్కాం మరింత చర్చనీయాంశంగా మారింది.
లాహోర్లోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఐసీసీకి ఫిర్యాదు చేసి, మ్యాచ్ రిఫరీ అయిన ఆండీ పైక్రాఫ్ట్, మ్యాచ్ ముందు లేదా తర్వాత జట్ల మధ్య హ్యాండ్షేక్ జరగకూడదని సూచించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ ఫుట్బాల్ చీటింగ్ పాకిస్తాన్కు మరో పెద్ద అవమానంగా నిలిచింది. దీనిపై ఎఫ్ఐఏ పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు నకిలీ పత్రాలు, ఫుట్బాల్ ఫెడరేషన్ నమోదు పత్రాలు, ప్రభుత్వ అనుమతులను గుర్తించారు. ఈ వ్యవహారంపై అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
