Let's talk: editor@tmv.in
ఫండింగ్‌ బిల్లుపై ట్రంప్‌ సంతకం.. అమెరికాలో ముగిసిన షట్‌డౌన్‌

ఫండింగ్‌ బిల్లుపై ట్రంప్‌ సంతకం.. అమెరికాలో ముగిసిన షట్‌డౌన్‌

Shaik Mohammad Shaffee
14 నవంబర్, 2025

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో అత్యధిక కాలం, అంటే సుదీర్ఘంగా 43 రోజుల పాటు కొనసాగిన ఆర్థిక ‘షట్‌డౌన్’కు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వ కార్యకలాపాలను పునరుద్ధరించే ఫండింగ్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) సంతకం చేశారు. దీంతో అక్టోబర్ 1, 2025న ప్రారంభమైన ఈ సంక్షోభానికి అధికారికంగా ముగింపు లభించింది.

పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం

షట్‌డౌన్‌ను ముగించే ప్రభుత్వ ఫండింగ్ బిల్లుకు ముందుగా కాంగ్రెస్‌లోని రెండు సభల్లోనూ ఆమోదం లభించింది. మూడు రోజుల క్రితమే సెనేట్‌లో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడింది. రిపబ్లికన్లకు కొద్దిమంది డెమొక్రాట్ల మద్దతు లభించడంతో 60-40 ఓట్ల తేడాతో బిల్లు పాస్ అయింది. బుధవారం నాడు ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ఈ బిల్లు 222-209 ఓట్ల స్వల్ప తేడాతో ఆమోదం పొందింది. దాదాపు అందరు రిపబ్లికన్లు, కొంతమంది డెమొక్రాట్లు దీనికి అనుకూలంగా ఓటు వేశారు. బిల్లు ఆమోదం పొందిన కొద్ది గంటల్లోనే అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం, ప్రభుత్వ ఏజెన్సీలకు జనవరి 30, 2026 వరకు నిధులు కేటాయించబడతాయి.

షట్‌డౌన్‌కు కారణం ఏంటి

ఈ సుదీర్ఘ షట్‌డౌన్ రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల మధ్య నెలకొన్న బడ్జెట్ వివాదం కారణంగా మొదలైంది. ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన ఫెడరల్ నిధుల బిల్లుకు సెనేట్‌లో ఆమోదం దక్కకపోవడమే ప్రధాన కారణం. దేశ ప్రజలకు సబ్సిడీపై చవకైన వైద్య సేవలు అందించే ఆఫర్డబుల్ కేర్ యాక్ట్ సబ్సిడీల విస్తరణపై డెమొక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రిపబ్లికన్లు ఖర్చులు తగ్గించాలని, డెమొక్రాట్లు ఆరోగ్య సంరక్షణ రాయితీలను పెంచాలని కోరారు. సెప్టెంబర్ 30, అర్ధరాత్రిలోపు (అమెరికా కాలమానం ప్రకారం) బిల్లు క్లియరెన్స్ కోసం ఎదురుచూసినా, సెనేట్‌లో రిపబ్లికన్లు మెజారిటీని (ఆమోదానికి అవసరమైన 60 ఓట్లు) సాధించలేకపోవడంతో ట్రంప్ సర్కారు షట్‌డౌన్ ప్రకటించింది. ప్రభుత్వ ఖర్చులకు అవసరమైన బడ్జెట్ ఆమోదం లేకపోవడం వల్ల ఫెడరల్ ఏజెన్సీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బు లేక ఈ ఆర్థిక సంక్షోభం ఏర్పడింది.

షట్‌డౌన్ ప్రభావాలు

43 రోజుల పాటు కొనసాగిన ఈ సుదీర్ఘ షట్‌డౌన్ అమెరికన్ల జీవితాలపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 1.4 మిలియన్ల ఫెడరల్ ఉద్యోగులు జీతాలు లేకుండా పని చేయాల్సి వచ్చింది. సుమారు 7.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలు ఆలస్యం అయ్యాయి, దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వంటి ఆహార సహాయ పథకాలు 42 మిలియన్ల అమెరికన్లకు ఆటంకం కలిగించాయి. షట్‌డౌన్ ప్రభావం ముఖ్యంగా విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, టీఎస్‌ఏ సిబ్బంది విధులకు గైర్హాజరు కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు ఆలస్యం అయ్యాయి, వేలాది సర్వీసులు రద్దయ్యాయి. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనాల ప్రకారం, ఈ షట్‌డౌన్ ఆర్థిక వృద్ధిని రెండు శాతాలు తగ్గించి, సుమారు మూడు బిలియన్ డాలర్ల నష్టాన్ని కలిగించింది.

బిల్లుపై సంతకం చేయడానికి ముందు అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, "మన దేశం ఎన్నటికీ దోపిడీకి లొంగబోదనే స్పష్టమైన సందేశాన్ని ఈ రోజు మనం ప్రపంచానికి పంపిస్తున్నాం" అని అన్నారు. డెమొక్రాట్ల చర్యల కారణంగా అమెరికా కొంతకాలం విపత్తు పరిస్థితులను ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు.

ఉద్యోగులకు ఉపశమనం

ఈ బిల్లుతో షట్‌డౌన్ సమయంలో పనిచేసిన ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు (బ్యాక్ పే) అందనున్నాయి. విశ్లేషకులు ఈ ఒప్పందాన్ని తాత్కాలిక పరిష్కారంగా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వానికి జనవరి 30, 2026 వరకు నిధులు లభించినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ బడ్జెట్ వివాదం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాయిటర్స్/ఇప్సోస్ సర్వే ప్రకారం, 50 శాతం అమెరికన్లు ఈ షట్‌డౌన్‌కు రిపబ్లికన్లను, 47 శాతం మంది డెమొక్రాట్లను నిందించారు. ఈ వివాదం రెండు పార్టీలకూ రాజకీయంగా నష్టం కలిగించింది.

జాతీయ అప్పు పెంపు

షట్‌డౌన్ ముగింపు డీల్‌లో భాగంగా ప్రభుత్వానికి నిధులు పొడిగించడం ద్వారా, అమెరికా జాతీయ అప్పు 38 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అప్పు పరిమితి (డెట్ సీలింగ్) పెంపును అమెరికా కాంగ్రెస్ ఆమోదిస్తుంది. ఈ ఫండింగ్ ఎక్స్‌టెన్షన్ వల్ల ప్రభుత్వం సంవత్సరానికి సుమారు 1.8 ట్రిలియన్ డాలర్ల అప్పులు చేర్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా, ఈ విధంగా అప్పులను పెంచుకుంటూ పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం షట్‌డౌన్ ముగియడంతో, ప్రభుత్వ విభాగాలు మళ్లీ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించాయి. ఫెడరల్ ఉద్యోగులు విధుల్లో చేరనున్నారు.

ఫండింగ్‌ బిల్లుపై ట్రంప్‌ సంతకం.. అమెరికాలో ముగిసిన షట్‌డౌన్‌ - Tholi Paluku