
ప్లాస్టిక్ సంచిలో కుళ్లిన మృతదేహం
తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఒక భయానక నేరం వెలుగులోకి వచ్చింది. హిండన్ కాలువ సమీపంలో గుర్తు తెలియని పురుషుడి కుళ్లిపోయిన మృతదేహం లభ్యం అయింది. ఈ దారుణ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
స్థానికుల కథనం మేరకు శనివారం సాయంత్రం ముల్లా కాలనీకి ఎదురుగా ఉన్న హిండన్ కాలువ పక్కన అనుమానాస్పదంగా ఒక పెద్ద వస్తువు పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ బృందం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా గోధుమ రంగు టేపుతో గట్టిగా మూసి ఉన్న ఒక పెద్ద ప్లాస్టిక్ సంచి కనిపించింది. దాన్ని తెరిచి చూడగా ఘోరమైన పరిస్థితిలో పడిఉన్న కుళ్లిపోయిన మృతదేహం బయటపడింది.
కాగా ఈ మృతదేహం చాలా రోజుల క్రితం నాటిదని, దుర్వాసన వస్తుండటంతో హత్య కొద్ది రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని ఒక పోలీసు అధికారి తెలిపారు. అంతేకాక మృతదేహం చుట్టూ ఉన్న టేపును పరిశీలిస్తే, నిందితులు ప్రొఫెషనల్స్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలాన్ని పూర్తిగా సీల్ చేసి కీలక ఆధారాల కోసం క్రైమ్, ఫోరెన్సిక్ నిపుణుల రంగంలోకి దింపారు అధికారులు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం, గుర్తింపు ప్రక్రియల నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇక ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం, నిందితులు ఆ వ్యక్తిని మరెక్కడో హత్య చేసి తమ నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని రహస్యంగా కాలువ వద్ద తెచ్చి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మరణానికి గల కచ్చితమైన కారణం పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు ఈ దారుణ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుడి గుర్తింపు కోసం మిస్సింగ్ కేసుల రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.అదేవిదంగా హత్య కేసును ఛేదించేందుకు స్థానిక సమాచారం, సాంకేతిక ఆధారాలపై పోలీసులు దృష్టి సారించినట్లు అధికారి వెల్లడించారు.
