Let's talk: editor@tmv.in
ప్లాన్ ప్రకారమే గోదావరి నల్లమలసాగర్‌‌కు సీఎం సహకరిస్తున్నారు: హరీష్ రావు

ప్లాన్ ప్రకారమే గోదావరి నల్లమలసాగర్‌‌కు సీఎం సహకరిస్తున్నారు: హరీష్ రావు

Gaddamidi Naveen
31 జనవరి, 2026

గోదావరి జలాల మళ్లింపు, ఏపీ చేపట్టిన నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా శుక్ర‌వారం కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన జరిగే కమిటీ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

నల్లమల సాగర్ - తెలంగాణకు జల ద్రోహం

తెలంగాణకు రావాల్సిన సుమారు 200 టీఎంసీల గోదావరి జలాలను గంపగుత్తగా తరలించుకుపోయేలా ఏపీ 'నల్లమల సాగర్' ప్రాజెక్టును ప్లాన్ చేసిందని, దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరించడం గురుదక్షిణ చెల్లించడమేనని హరీష్ రావు విమర్శించారు. కత్తి చంద్రబాబుది అయితే, పొడిచేది రేవంత్ రెడ్డి అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ పేరు మారినా ఏపీ జల దోపిడీ మాత్రం ఆగలేదని, తెలంగాణ ప్రాంతం వాడే మనకు ద్రోహం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లమల సాగర్ డీపీఆర్ ప్రక్రియను ఆపితేనే సమావేశానికి వస్తామని గతంలో కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం, ఇప్పుడు ఏ కండిషన్లకు కేంద్రం ఒప్పుకుందని ఢిల్లీ మీటింగ్‌కు వెళ్తోందని హరీష్ రావు ప్రశ్నించారు. ఇది స్పష్టంగా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని, అందుకే ఈ రోజును తెలంగాణ నీటి చరిత్రలో "బ్లాక్ డే"గా పరిగణించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26 తెలంగాణ ప్రగతిని చాటిచెప్పిందని హరీష్ రావు గుర్తుచేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని కేంద్రమే అంగీకరించిందన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్, కిషన్ రెడ్డిలు వాస్తవాలు తెలుసుకోవాలని, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆర్థిక సర్వేనే ధ్రువీకరించిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కులపై చిత్తశుద్ధి ఉంటే నేటి సమావేశాన్ని బహిష్కరించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని బీఆర్ఎస్ పక్షాన ఆయన డిమాండ్ చేశారు.