
ప్రొఫెషనల్ బాక్సింగ్ బరిలోకి మేరీకోమ్?
భారత బాక్సింగ్ ఐకాన్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ కాంస్య పతక విజేత ఎం.సి. మేరీకోమ్ త్వరలో ప్రొఫెషనల్ బాక్సింగ్ బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన 'సండేస్ ఆన్ సైకిల్' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. 43 ఏళ్ల మేరీకోమ్, వయో పరిమితి కారణంగా అమెచ్యూర్ బాక్సింగ్‌లో దేశం తరఫున పోటీపడే అవకాశం కోల్పోయినప్పటికీ, రింగ్‌లో తన సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
కొత్త అవకాశాల దిశగా..
అమెచ్యూర్ బాక్సింగ్‌లో ఆరు ప్రపంచ టైటిళ్లు సాధించడం తన కెరీర్‌లో అత్యున్నత ఘట్టమని మేరీకోమ్ పేర్కొన్నారు. "వయో నిబంధనల వల్ల అమెచ్యూర్ సర్క్యూట్‌లో ఇక పోటీ పడలేను. కానీ, ప్రొఫెషనల్ బాక్సింగ్ రూపంలో నాకు కొత్త అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దీనిపై సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. కఠినంగా శ్రమిస్తూ మళ్లీ పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాను. నేను ఇంకా ఏం చేయగలనో ప్రపంచానికి చూపిస్తాను" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
మణిపూర్ పరిస్థితులపై ఆందోళన
తన వ్యక్తిగత లక్ష్యాలతో పాటు, మణిపూర్‌లోని తన బాక్సింగ్ అకాడమీ ద్వారా యువ ప్రతిభను వెలికితీయడంలో ఆమె నిమగ్నమయ్యారు. మణిపూర్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అక్కడికి వెళ్లడం అప్పుడప్పుడు ఇబ్బందిగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ భౌతికంగా అక్కడ లేకపోయినా ఫోన్ ద్వారా నిరంతరం అకాడమీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నానని, వయసుతో సంబంధం లేకుండా ఫిట్‌గా ఉండటమే తన లక్ష్యమని మేరీ వివరించారు.
క్రీడలే దేశానికి గుర్తింపు
భారత్ 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో క్రీడల ప్రాధాన్యతను మేరీకోమ్ నొక్కి చెప్పారు. "ఒక దేశానికి అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే క్రీడా రంగం అభివృద్ధి చెందడం చాలా ముఖ్యం. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. బాక్సింగ్ రంగంలోనూ సౌకర్యాలు అద్భుతంగా పెరిగాయి" అని ప్రశంసించారు.
