Let's talk: editor@tmv.in
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై నియంత్రణ చట్టం తేవాలి: కవిత

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై నియంత్రణ చట్టం తేవాలి: కవిత

Gaddamidi Naveen
4 ఏప్రిల్, 2026

రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఫీజుల పెంపు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోపిడీ చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విద్యా రంగంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఒకేసారి 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచి యాజమాన్యాలు తల్లిదండ్రులను ఆగం చేస్తున్నాయని కవిత విమర్శించారు. ప్రభుత్వం వెంటనే 'ఫీజు నియంత్రణ చట్టం' తీసుకురావాలని, ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించి బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. ఏటా ఫీజు పెంపు 8 శాతానికి మించకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆమె సూచించారు. లక్ష రూపాయలు ఉన్న ఫీజును అదనంగా 30 వేలు పెంచితే మధ్యతరగతి కుటుంబాలు ఎలా బతుకుతాయి? ఫీజులు పెరిగినట్లుగా తల్లిదండ్రుల జీతాలు పెరగవు కదా! అని ఆమె ప్రశ్నించారు.

రాష్ట్ర విద్యా స్వరూపాన్ని వివరిస్తూ.. తెలంగాణలో మొత్తం 39,641 పాఠశాలలు ఉండగా, అందులో 62 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది ఉంటే, ప్రైవేట్ పాఠశాలల్లో ఏకంగా 38 లక్షల మంది చదువుతున్నారని, ప్రభుత్వం వీటిపై నియంత్రణ కోల్పోయిందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా నారాయణ, చైతన్య వంటి 1,200 కార్పొరేట్ స్కూళ్లలో 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, అక్కడ కేవలం వ్యాపార దృక్పథమే కనిపిస్తోందని క‌విత‌ విమర్శించారు.

నారాయణ, చైతన్య వంటి సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ, టీచర్లకు పీఎఫ్ చెల్లింపులు, తక్కువ జీతాలు వంటి అంశాలపై దర్యాప్తులు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఒకే చోట వంటలు తయారు చేయడం వల్ల ఆహార విషబాధ జరిగితే వేలాది మంది విద్యార్థులు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అలాగే రూ. 2 వేల విలువైన పుస్తకాలకు రూ. 15 వేలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

బకాయిలు, ఉద్యోగ అవకాశాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం 11 వేల కోట్లు బకాయి పడిందని, దీనివల్ల కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని ఆమె తెలిపారు. ఇంకా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.42 వేల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో రూ.212 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. అలాగే, ఉత్తరాది నుంచి వస్తున్న అలెన్, ఫిజిక్స్ వాలా వంటి సంస్థలు ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం ఇవ్వడం లేదని, తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వని స్కూళ్లకు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజులను నియంత్రించలేదని గతంలో విమర్శించిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని కవిత ప్రశ్నించారు. ముఖ్యమంత్రే కార్పొరేట్ ఆస్పత్రుల ప్రారంభోత్సవాలకు వెళ్తూ ప్రైవేట్ దోపిడీకి సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు నియంత్రణ కమిటీని వేయాలని, లేనిపక్షంలో జాగృతి ఆధ్వర్యంలో పాఠశాలల ముందు భారీ ఆందోళనలు చేస్తామని ఆమె హెచ్చరించారు.