
ప్రైవేట్ కళాశాలల ఫీజు బకాయిల చర్చలు విజయవంతం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విజయవంతంగా ముగిశాయి. ప్రజాభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. చర్చల అనంతరం, పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదలకు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో, గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల బంద్‌ను విరమిస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి.
ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు ఉన్న మొత్తం బకాయి రూ.1,500 కోట్ల రూపాయలలో భాగంగా ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేయబడినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మరో రూ.600 కోట్లను వెంటనే విడుదల చేయాలని నిర్ణయించాము అని ఆయన తెలిపారు. అలాగే మిగిలిన రూ.300 కోట్లు త్వరలో క్లియర్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ బకాయి చెల్లింపులు, ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారాలకు సంబంధించినవి.
విద్యార్థుల ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయబడినదన్నారు. ఈ కమిటీ యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి అవసరమైతే విధానంలో సంస్కరణలు చర్చించి, సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనడానికి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా వ్యవస్థ స్థిరత్వం కోసం కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు.ఈ బకాయిల సమస్య ఒక్క కాలేజీలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద నడిచే అన్ని రకాల ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించినది.
