Let's talk: editor@tmv.in
ప్రైవేటు ఆల‌యాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి

ప్రైవేటు ఆల‌యాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి

Panthagani Anusha
2 డిసెంబర్, 2025

రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాల్లో భక్తుల రద్దీపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా అధికారులను ఆదేశించారు. 2025లో జరిగిన మూడు ఘోర దేవాలయ ప్రమాదాల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేశారు.

సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేటు ఆలయాలు ప్రభుత్వ పరిధికి చెందవన్న భావనతో నిర్లక్ష్యం ప్రదర్శించడానికి అవకాశం లేదన్నారు. తాము పర్యవేక్షించే పరిధిలోని అన్ని ప్రముఖ ప్రైవేటు ఆలయాల పరిస్థితులపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.

తిరుపతి బైరాగిపట్టెడలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట, సింహాచలంలో గోడ కూలిన ఘటన, కాశీబుగ్గలో మెట్ల రైలింగ్ విరిగిపడిన సంఘటనలు మూడు రాష్ట్రంలో భద్రతా లోపాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చూపించాయని ఆయన అన్నారు. వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం, ఇతర పండుగల సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశాన్ని అధికారులు ముందుగా అంచనా వేసి చర్యలు తీసుకోవాలన్నారు.

పండుగల సందర్భంగా ఆలయాలకు ఎంతమంది భక్తులు చేరతారో, రద్దీ నియంత్రణకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఆలయ నిర్వాహకులు ముందుగానే ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయాలని ఆయన స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్ల కోసం సంబంధిత ఆలయాలు పోలీసుల నుండి అనుమతి తీసుకోవడం తప్పనిసరిగా ఉండాలన్నారు. అలా చేస్తేనే తొక్కిసలాటలు, రైలింగ్‌లు విరగడం వంటి ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు.

ప్రధాన పర్వదినాల సందర్భంగా అనుసరించాల్సిన భద్రతా చర్యలు, రద్దీ నియంత్రణ విధానాలపై ప్రత్యేక మార్గదర్శకాలను "గైడ్‌లైన్ బుక్‌లెట్" రూపంలో రూపొందించి అన్ని ప్రైవేటు ఆలయాలకు పంపించాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా పరిశుభ్రత, పారిశుధ్యం, ప్రవేశ-నిష్క్రమణ మార్గాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు.

సమీక్షలో వ్యవసాయ శాఖ పనితీరును పరిశీలించిన సీఎస్ విజ‌యానంద్, రాబోయే రబీ సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత రాకుండా ఇప్పటి నుంచే కఠినమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే తగినంత ఎరువుల నిల్వలు ఉన్నాయని, రబీ సీజన్‌కు అవసరమైన సరఫరా నిరంతరం కొనసాగుతోందని వారు తెలిపారు.

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. సమావేశంలో ఐటీ, ఆర్టీసీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని, సీఈఓ ప్రఖర్ జైన్, బుడితి రాజశేఖర్, గీతాంజలి శర్మ, ధాత్రి రెడ్డి, మాలికా గార్గ్ తదితర అధికారులు పాల్గొన్నారు.