Let's talk: editor@tmv.in
ప్రేగ్‌ మాస్టర్స్: నేడు గుకేశ్ వర్సెస్ అరవింద్‌ పోరు

ప్రేగ్‌ మాస్టర్స్: నేడు గుకేశ్ వర్సెస్ అరవింద్‌ పోరు

Shaik Mohammad Shaffee
4 మార్చి, 2026

ప్రేగ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చెస్ టోర్నీలో నేడు ఇద్దరు భారతీయుల మధ్యే అసలైన పోరు జరగనుంది. ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ తన ఆరో రౌండ్‌లో స్వదేశానికే చెందిన అరవింద్‌ చిదంబరంతో తలపడనున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవని గుకేశ్, కనీసం ఈ రౌండ్‌లోనైనా విజయం సాధించి మళ్లీ ఫామ్‌లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.

గుకేశ్‌కు గడ్డు కాలం

ప్రస్తుత టోర్నీలో గుకేశ్ ఆటతీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఆడిన ఐదు రౌండ్లలో మూడు డ్రా, రెండు ఓటములతో కేవలం 1.5 పాయింట్లతోనే సరిపెట్టుకున్నాడు. ఈ పేలవ ప్రదర్శన ప్రభావం అతడి అంతర్జాతీయ ర్యాంకింగ్‌పై కూడా పడింది. లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో గుకేశ్ 17వ స్థానానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జోర్డన్ వాన్ ఫొరెస్ట్, నోడిర్బెక్ అబ్దుసట్టోరోవ్ చేతిలో పరాజయాలు గూకేష్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. గెలిచే స్థితి నుంచి సమయాభావం వల్ల నోడిర్బెక్‌తో జరిగిన మ్యాచ్‌లో పొరపాటు చేసి ఓడిపోవడం గుకేశ్‌‌కు పెద్ద ఎదురుదెబ్బ. ఇకపై జరగబోయే మ్యాచుల్లో స్పెయిన్‌కు చెందిన డేవిడ్ ఆంటన్, జర్మనీకి చెందిన కీమర్ వంటి వారితో గుకేశ్‌‌ తలపడాల్సి ఉంది.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అరవింద్‌

గత ఏడాది ఇదే టోర్నీలో విజేతగా నిలిచి అగ్రశ్రేణి చెస్‌లోకి దూసుకొచ్చిన అరవింద్‌ చిదంబరం, ఈసారి తన ఫామ్‌ను నిలబెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. అమెరికా ఆటగాడు నిమాన్‌పై లభించిన ఒక్క విజయమే అతడి ఖాతాలో ఉంది. ప్రస్తుతం గుకేశ్‌‌, అరవింద్‌ ఇద్దరూ చెరో 1.5 పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచారు. అయితే అరవింద్‌ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే, ఈ ఇద్దరు భారతీయుల పోరులో గుకేశ్‌‌ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

జోర్డన్ హవా.. నవారా జోరు

డచ్ గ్రాండ్‌ మాస్టర్ జోర్డన్ వాన్ ఫొరెస్ట్ ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఒక ఓటమితో మొత్తం 4 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్థానిక హీరో డేవిడ్ నవారా కూడా చివరి సీడ్‌గా బరిలోకి దిగి 3.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉండి సత్తా చాటుతున్నాడు.

సూర్యశేఖర్‌పై దివ్య పైచేయి

ఛాలెంజర్స్ విభాగంలో భారత యువ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ తన నిలకడను చాటుతోంది. ఐదు రౌండ్లకు గాను ఆమె 2.5 పాయింట్లతో రాణిస్తోంది. ముఖ్యంగా గత రౌండ్‌లో భారత సీనియర్ క్రీడాకారుడు, మాజీ ఛాంపియన్‌ సూర్యశేఖర్ గంగూలీని ఆమె ఓడించడం సంచలనం సృష్టించింది. ఒక భారతీయ మహిళా క్రీడాకారిణి చేతిలో గంగూలీ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం గంగూలీ కేవలం ఒక పాయింట్‌తో పట్టికలో అట్టడుగున ఉండగా, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన వాక్లావ్ ఫినెక్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆరో రౌండ్‌ మాస్టర్స్ జంటలు

ప్రేగ్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ ఆరో రౌండ్‌లో భాగంగా నేడు ఆసక్తికరమైన పోటీలు జరగనున్నాయి. ముఖ్యంగా భారత్‌కు చెందిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు డి. గుకేశ్-అరవింద్‌ చిదంబరం ఒకరితో ఒకరు తలపడనుండటం విశేషం. మిగిలిన మ్యాచ్‌ల్లో అమెరికాకు చెందిన హాన్స్‌ నిమాన్‌తో జర్మనీ ప్లేయర్ విన్సెంట్ కీమర్‌, టోర్నీలో దూసుకుపోతున్న నెదర్లాండ్స్ ఆటగాడు జోర్డన్ వాన్ ఫొరెస్ట్‌తో స్థానిక హీరో డేవిడ్ నవారా పోటీ పడనున్నారు. అలాగే ఉజ్బెకిస్థాన్‌కు చెందిన యాకుబోయెవ్-అబ్దుసట్టోరోవ్ మధ్య ఒక పోరు, స్పెయిన్‌కు చెందిన డేవిడ్ ఆంటన్- ఇరాన్ ప్లేయర్ పర్హామ్ మఘ్సూద్లూ మధ్య మరో పోరు జరగనుంది.