
ప్రేగ్ మాస్టర్స్: ఇంకా బోణీ కొట్టని గుకేశ్
ప్రపంచ చెస్ ఛాంపియన్ డి. గుకేశ్‌కు ఈ మధ్య కాలం ఏమాత్రం కలిసిరావడం లేదు. ప్రేగ్ అంతర్జాతీయ చెస్ పోటీల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న గుకేశ్‌కు.. ఐదో రౌండ్‌లోనూ ఓటమి ఎదురైంది. తన పాత ప్రత్యర్థి, ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అబ్దుసత్తోరోవ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో.. గుకేశ్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఓడిపోయాడు. సరిగ్గా నెల రోజుల క్రితం జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్‌లోనూ ఇదే ప్రత్యర్థి చేతిలో ఇలాగే తప్పులు చేసి ఓడిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ టోర్నీలో మొదటి విజయం కోసం గుకేశ్ పోరాడుతున్నాడు.
పట్టు చిక్కినట్టే చిక్కి..
నల్లటి పావులతో ఆడిన గుకేశ్ మ్యాచ్ ఆరంభం నుంచి కొత్త వ్యూహంతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. మిడిల్ గేమ్ సమయానికి అబ్దుసత్తోరోవ్ ‘రాజు’కు ముప్పు తలపెడుతూ గుకేశ్ పటిష్ట స్థితికి చేరుకున్నారు. కంప్యూటర్ విశ్లేషణల ప్రకారం గుకేశ్ విజయం నల్లేరు మీద నడకలా కనిపించింది. అయితే సమయం మించిపోతున్న కొద్దీ ఒత్తిడికి లోనైన గుకేశ్, మొదటి టైమ్ కంట్రోల్ ముగిసే సమయానికి కీలకమైన తప్పులు చేశారు. ప్రత్యర్థి అబ్దుసత్తోరోవ్ కూడా కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ, గుకేశ్ చేసిన రెండో బ్లండర్ ప్రత్యర్థి పావులను విజయ తీరాలకు చేర్చింది.
అరవింద్ చిదంబరంకు మూడో ఓటమి
ఇదే టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన మరో భారతీయుడు అరవింద్ చిదంబరం కూడా నిరాశపరిచారు. స్పెయిన్ ఆటగాడు డేవిడ్ ఆంటోన్ గైజారో చేతిలో ఆయన ఓటమి చెందారు. ఐదు రౌండ్లలో అరవింద్‌కు ఇది మూడో ఓటమి కావడం గమనార్హం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుకేశ్, అరవింద్ చిదంబరం, అమెరికాకు చెందిన హన్స్ మోక్ నీమన్ 1.5 పాయింట్లతో చివరి మూడు స్థానాల్లో నిలిచారు. డచ్ గ్రాండ్ మాస్టర్ జోర్డెన్ వాన్ ఫొరెస్ట్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
దివ్య దేశ్‌ముఖ్ బోణి
ఛాలెంజర్స్ విభాగంలో భారత మహిళా గ్రాండ్ మాస్టర్, ప్రపంచ జూనియర్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ ఎట్టకేలకు తన విజయ ఖాతాను తెరిచారు. స్వదేశీ ఆటగాడు సూర్యశేఖర్ గంగూలీని ఓడించి టోర్నీలో తన మొదటి విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో ఆమె 50 శాతం స్కోరుకు చేరుకోగా, సూర్యశేఖర్ గంగూలీ కేవలం ఒక పాయింట్‌తో వెనుకబడ్డారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఫినెక్ వాన్క్లావ్ 4 పాయింట్లతో ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నారు.
