
ప్రియాంక ఏదో ఒకరోజు పీఎం అవుతారు : రాబర్ట్ వాద్రా
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాకు రాజకీయాల్లో ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందని, ఒక రోజు ఆమెను దేశంలో అత్యున్నత పదవిలో ప్రజలు చూడాలనుకుంటారని వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా అన్నారు. అది కాలక్రమంలో జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇటీవల ప్రియాంక గాంధీని మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పోలుస్తూ, ఆమె కూడా బలమైన ప్రధానమంత్రిగా నిలుస్తారని వ్యాఖ్యానించిన నేపథ్యంలో వాద్రా పై విధంగా మంగళవారం స్పందించారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న వేధింపుల అంశంపై చర్యలు తీసుకునే సందర్భంలో మాట్లాడుతూ, ప్రియాంక గాంధీ ఉంటే ఇందిరా గాంధీలా దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారని ఇమ్రాన్ మసూద్ అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాబర్ట్ వాద్రా
ప్రియాంక తన నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ నుంచి ఎంతో నేర్చుకుంది. ప్రజలు ఆమెను అభిమానిస్తారు. ఆమె మాట్లాడినప్పుడు హృదయం నుంచి మాట్లాడుతుంది. ప్రజలు వినాల్సిన అంశాలపై ఆమె గొంతెత్తుంది. వాటిపై ఆమె బలంగా చర్చిస్తుంది అని పీటీఐకి తెలిపారు. దేశంలో క్షేత్ర స్థాయిలో అవసరమైన మార్పులు తీసుకురావడంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. అది కేవలం ఆమె ఆలోచనల ఆధారంగా కాదు, ప్రజల ఆలోచనలు, సమ్మతి ఆధారంగా జరిగే మార్పులు. కాలక్రమంలో ఇది జరుగుతుంది, ఇది అనివార్యం అని రాబర్ట్ వాద్రా అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎన్నికల్లో పరాజయాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రియాంక గాంధీకి మరింత పెద్ద బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పార్టీ లోపల కొంతకాలంగా వినిపిస్తోంది.
బీజేపీ విమర్శలు
ఈ అంశంపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శలు గుప్పించారు.
రాహుల్ గాంధీ ఏమి చెబుతున్నాడో, అతని పార్టీ నేతలే తిరస్కరిస్తున్నారు. తాజా ఉదాహరణ శశి థరూర్. బీహార్‌లో గత 20 ఏళ్లుగా ఎన్డీయే చేసిన అభివృద్ధిని ప్రశంసిస్తూ, రాహుల్ గాంధీ చెప్పే ‘ఓట్ల దొంగతనం’ కథనాన్ని ఆయన పూర్తిగా ఖండించారని పూనావాలా అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్, రాహుల్ గాంధీపై తనకు ఇక నమ్మకం లేదని స్పష్టంగా చెప్పారు. ఆయన స్థానంలో ప్రియాంక గాంధీ వాద్రాను ముందుకు తేవాలని సూచించారు. ఆ అభిప్రాయానికి ఇప్పుడు రాబర్ట్ వాద్రా కూడా మద్దతు ఇస్తున్నారు అని బీజేపీ పేర్కొంది.
