
ప్రారంభానికి సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ సిద్ధం
హైదరాబాద్‌లో పలు కొత్త ఫ్లైఓవర్లు ఇటీవల ప్రారంభం కాగా, త్వరలో మరో కొత్త ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి రానుంది. పాతబస్తీ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. సంతోష్ నగర్ సమీపంలో రూ. 620 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన అత్యాధునిక స్టీల్ బ్రిడ్జ్ (ఫైఓవర్) నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ నాలుగు లైన్ల ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
మొత్తం 2.58 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ నాలుగు లేన్ల స్టీల్ ఫ్లైఓవర్ సంతోష్‌నగర్–సైదాబాద్ ప్రధాన మార్గాన్ని అనుసంధానిస్తుంది. ఈ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం కావడం వల్ల ప్రతిరోజూ 1.5 లక్షలకు పైగా వాహనదారులకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించనుంది.
ట్రాఫిక్ అధ్యయనాల ప్రకారం 2015లో ఈ కారిడార్‌పై రోజుకు 70,576 వాహనాలు మాత్రమే సంచరించగా, 2026 నాటికి ఆ సంఖ్య దాదాపు 1.5 లక్షలకు చేరుకుంది. 2035 నాటికి రోజువారీ వాహనాల సంఖ్య 1,93,632కు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు.
సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంతో పాతబస్తీ కనెక్టివిటీని మరింత బలోపేతం కానుండగా, నగర మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది మరో ముఖ్యమైన అడుగుగా నిలవనుంది. పెరుగుతున్న రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆధునికీకరణలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
