
ప్రాధాన్యతల వారీగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి: సీఎం
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యత క్రమంలో చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ఏడాది హంద్రీ-నీవా కాలువ వెడల్పు పనులను పట్టుదలతో పూర్తి చేశామని, పోలవరం పనులను పరుగులు పెట్టించామని గుర్తు చేసిన సీఎం.. అదే స్ఫూర్తితో 2026 నాటికి వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని స్పష్టం చేశారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కీలక సమీక్ష నిర్వహించారు.
రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం అందిస్తున్న ‘పూర్వోదయ’ పథకాన్ని ఒక గొప్ప అవకాశంగా మలుచుకోవాలని సీఎం సూచించారు. ప్రకాశం సహా రాయలసీమలోని 9 జిల్లాల్లో ఉద్యానవన రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ ఏడాది సుమారు 2 లక్షల హెక్టార్లలో రైతులు ఉద్యాన పంటలు సాగు చేసేలా వారిని సమాయత్తం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి అనుగుణంగా ఇరిగేషన్, రోడ్డు నెట్‌వర్క్, లాజిస్టిక్స్ మరియు కోల్డ్ చెయిన్ వ్యవస్థలను పటిష్టం చేయాలన్నారు. కేంద్రం ఈ పథకం కింద రూ. 40 వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, దానికి అదనంగా మరిన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారంపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో సంప్రదింపులు జరిపి, వివాదాలు లేకుండా పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే వరద నీటిని వినియోగించుకోవాలన్నదే తమ ఉద్దేశమని తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అందుకే తాము అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. నల్లమల సాగర్ పూర్తయితే అవసరమైన పక్షంలో తెలంగాణకు కూడా నీటిని ఇచ్చే పరిస్థితి ఉంటుందని ఆయన వివరించారు.
మరోవైపు రాష్ట్ర అభివృద్ధిలో పీపీపీ విధానానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా 290 ప్రాజెక్టులను ఈ పద్ధతిలో చేపట్టాలని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే పనులు ప్రారంభమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ పనుల్లో వేగం పెంచి, 2027 నాటికి వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి తన దావోస్ పర్యటనకు వెళ్లే ముందు కీలక రంగాల పురోగతిపై ఈ సమీక్ష నిర్వహించారు. పర్యటన ముగించుకుని తిరిగి రాగానే ఆయా పథకాల అమలు, సాంకేతిక సమస్యల పరిష్కారంపై సమగ్ర నివేదికలు సమర్పించాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాలని, అవసరమైతే కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
