Let's talk: editor@tmv.in
ప్రాధాన్యతల ఆధారంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సీఎం

ప్రాధాన్యతల ఆధారంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సీఎం

Panthagani Anusha
8 మార్చి, 2026

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై శుక్రవారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలవరం, వెలిగొండ, హంద్రీ–నీవా, పోలవరం–నల్లమల సాగర్ లింక్, చింతలపూడి లిఫ్ట్, వరికిపూడిశెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. అదేవిదంగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి చేపట్టాల్సిన పునరావాస (ఆర్‌అండ్‌ఆర్) కార్యక్రమాలపై కూడా చర్చించారు. కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్నాయని ఉమ్మడి రాష్ట్ర కాలంలో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాకపోవడం సరికాదని ఇకపై అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను తీర్చేలా ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం పేర్కొన్నారు.

ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్రంలోని సంబంధిత విభాగాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. సాంకేతిక నివేదికలు, ప్రమాణాలు, డాక్యుమెంటేషన్ వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని పోలవరం నిర్మాణంపై అంతర్జాతీయ నిపుణులు తరచుగా పరిశీలన జరిపేలా చర్యలు తీసుకోవాలని అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సలహాలు స్వీకరించాలని సూచించారు.

అదేవిదంగా గతంలో పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ఘటనను ప్రస్తావిస్తూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం వివరించారు. పోలవరం పనులను కాలపరిమితి విధానంలో పూర్తి చేయాలని ఇకపై ప్రతి నెలా ప్రాజెక్టు పురోగతిని స్వయంగా సమీక్షిస్తానని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు మేఘాద్రిగడ్డ వరకు పూర్తి చేయాలని, రైట్ మెయిన్ కెనాల్‌లో మిగిలిన పనులను కూడా ఈ సీజన్‌లో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిదంగా 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన నిర్మాణ, పునరావాస పనులను వేగవంతం చేయాలని సూచించారు.

మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు రూ.2041 కోట్లు అవసరమవుతాయని పేర్కొంటూ నిర్మాణ పనులతో పాటు పునరావాస కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. కాగా హంద్రీ–నీవా ఫేజ్–1 కాల్వ విస్తరణ పనులు ఇప్పటికే 92 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి నీటిని మడకశిర వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే నీవా బ్రాంచ్ కాల్వ ద్వారా చిత్తూరు వరకు నీటిని తీసుకెళ్లే చర్యలను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

ఇదిలాఉండగా ఉత్తరాంధ్రలో చిన్నచిన్న ప్రాజెక్టులు కూడా అనేకం పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులను ముందుగా చేపట్టాలని సీఎం సూచించారు. వంశాధార–నాగావళి, తోటపల్లి బ్యారేజ్, తారకరామ, మహేంద్రతనయ ఆఫ్‌షోర్, హీరమండలం, మద్దువలస, ఝంఝావతి, నాగావళి–చంపావతి లింక్ వంటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు.

అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల విడుదలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాలని ప్రాధాన్యత ప్రాజెక్టుల కోసం విడతల వారీగా నిధులు విడుదల చేసే విధంగా ఆర్థిక శాఖ ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అదేవిధంగా రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మత్తులు, నిర్వహణ పనులను హ్యామ్ విధానంలో చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రాధాన్యతల ఆధారంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సీఎం - Tholi Paluku