Let's talk: editor@tmv.in
ప్రాణాలను హరిస్తున్న గడ్డి మందును నిషేధించాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

ప్రాణాలను హరిస్తున్న గడ్డి మందును నిషేధించాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Panthagani Anusha
27 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలో పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతూ, ఎందరో ప్రాణాలను బలిగొంటున్న ప్రాణాంతక గడ్డిమందు ‘పారాక్వాట్’ విక్రయాలపై తక్షణమే నిషేధం విధించాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరిగిన ‘జీరో అవర్’లో ఆమె ఈ కీలక అంశాన్ని ప్రస్తావించారు.

సైలెంట్ కిల్లర్‌గా పారాక్వాట్

వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే పారాక్వాట్ ప్రస్తుతం సమాజంలో ఒక “సైలెంట్ కిల్లర్”గా మారిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. క్షణికావేశంలో ఆత్మహత్యా ప్రయత్నాలకు పాల్పడే వారు ఈ గడ్డిమందును ప్రధాన సాధనంగా ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. కేవలం 5 ఎం.ఎల్. (ఒక చిన్న స్పూన్) మోతాదు కడుపులోకి వెళ్లినా అది శరీరంలోని ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి కీలక అవయవాలను పూర్తిగా దెబ్బతీస్తుందని తద్వారా ప్రాణాపాయం తప్పదని ఆమె శాస్త్రీయ ఆధారాలతో సభకు వివరించారు.

విరుగుడు లేని విషం

పారాక్వాట్ అత్యంత ప్రమాదకరంగా మారడానికి ప్రధాన కారణం దీనికి సరైన విరుగుడు (యాంటీడోట్) లేకపోవడమేనని గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఈ మందు సేవించిన బాధితుడిని ఆసుపత్రికి తరలించినా వైద్యులకు కూడా వారిని కాపాడటం సాధ్యం కావడం లేదు. మార్కెట్‌లో ఇది చాలా తక్కువ ధరకే సులభంగా లభిస్తుండటం వల్ల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. ఒక చిన్న తప్పు నిర్ణయం వల్ల వందలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాలు పారాక్వాట్ వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని గుర్తించి దాని వినియోగాన్ని పూర్తిగా నిషేధించాయని ఆమె గుర్తుచేశారు. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆత్మహత్యలను నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఇలాంటి ప్రమాదకర రసాయనాల విక్రయాలపై కఠినమైన నియంత్రణలు స్పష్టమైన విధానాలు తీసుకురావాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత కావాలని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ప్రాణాలను హరిస్తున్న గడ్డి మందును నిషేధించాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి - Tholi Paluku