Let's talk: editor@tmv.in
ప్రాణాన్ని కాపాడిన మెట్రో రైలు

ప్రాణాన్ని కాపాడిన మెట్రో రైలు

Panthagani Anusha
31 అక్టోబర్, 2025

ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయే బెంగళూరు నగరంలో ఒక అద్భుతం జరిగింది. ట్రాఫిక్ రద్దీ సమయంలో ఏకంగా 30-33 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 61 నిమిషాల్లో చేరుకోవడానికి మెట్రో రైల్ ఉపయోగపడింది. అత్యవసరంగా అవయవ మార్పిడి చేయాల్సిన ఒక రోగి కోసం, దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తులను సకాలంలో నారాయణ హెల్త్ సిటీకి తరలించడంలో బెంగళూరు మెట్రో రైల్ (నమ్మ మెట్రో) గురువారం కీలక పాత్ర పోషించింది.

యశ్వంత్‌పుర్‌లోని ఒక ఆసుపత్రి నుంచి ఊపిరితిత్తులను సేకరించిన ట్రాన్స్‌ప్లాంట్ బృందం వాటిని బొమ్మసంద్రలోని నారాయణ హెల్త్ సిటీకి చేర్చాల్సి వచ్చింది. సాధారణంగా వారాంతపు రద్దీ వేళల్లో ఈ దూరం ప్రయాణించడానికి ఎక్కువ సమయం పట్టేది. అందుకే సమయాన్ని వృథా చేయకుండా బృందం గోరగుంటెపాళ్య మెట్రో స్టేషన్ (గ్రీన్ లైన్) నుంచి ప్రయాణాన్ని ప్రారంభించింది. కాగా ఆర్‌వీ రోడ్ వద్ద నుంచి ఇటీవలే ప్రారంభించిన కొత్త యెల్లో లైన్ మార్గాన్ని ఉపయోగించడం ద్వారా నగరంలోని ట్రాఫిక్ చిక్కులన్నింటినీ అధిగమించగలిగారు.

నారాయణ హెల్త్ సిటీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ వేగవంతమైన ప్రయాణం కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతినకుండా వాటి జీవక్రియ సామర్ఢ్యాన్ని కాపాడగలిగింది, దీనివల్ల మార్పిడి శస్త్రచికిత్స ఆలస్యం కాకుండా సకాలంలో రోగికి చికిత్స ఇవ్వగలిగామని వైద్యులు పేర్కొన్నారు. అంతేకాక బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్‌) అధికారులు, ముఖ్యంగా యెల్లో లైన్ ఆపరేషన్స్ బృందం, భద్రతా సిబ్బంది అత్యుత్తమ లాజిస్టికల్ మద్దతును అందించి ఈ ప్రాణదాత మిషన్‌లో ముఖ్య పాత్ర పోషించారని వివరించారు.