Let's talk: editor@tmv.in
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ

ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ

Gaddamidi Naveen
23 మార్చి, 2026

తనకు, తన కుటుంబ సభ్యులకు వరుసగా వస్తున్న ప్రాణహాని బెదిరింపులపై గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తనకు తక్షణమే భద్రత కల్పించాలని, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తన నివాసానికి చాలా కాలంగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, లేఖల ద్వారా తనకు ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని రాజాసింగ్ లేఖలో పేర్కొన్నారు. ఈ బెదిరింపులు ఇప్పుడు నాకే కాకుండా, నా కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. దీనిపై స్థానిక పోలీసులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా, యంత్రాంగం నుంచి ఎటువంటి స్పందన లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నా కుటుంబం తీవ్ర ప్రమాదంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులు, గుంపులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే ఉన్నత స్థాయి, కాలపరిమితి ఉన్న విచారణ చేపట్టాలని, దోషులను త్వరగా పట్టుకుని కఠిన శిక్షలు విధించాలని తనకు, తన కుటుంబానికి తగిన భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ సమస్యపై తాను రాస్తున్న చివరి లేఖ ఇదేనని రాజాసింగ్ స్పష్టం చేశారు. నేను ఇకపై భద్రత కోసం ఎవరినీ వేడుకోను. చట్టంపై గౌరవంతో ఇప్పటివరకు ఓపిక పట్టాను, కానీ నా సహనం పరిమితి దాటింది. గతంలో అనేక లేఖలు పంపినా కేవలం అక్నాలెడ్జ్‌మెంట్ కార్డులు తప్ప, ఎటువంటి ఫాలో-అప్ చర్యలు లేవు. భవిష్యత్తులో నా కుటుంబానికి ఏ చిన్న హాని జరిగినా దానికి యంత్రాంగమే బాధ్యత వహించాలి అని ఆయన హెచ్చరించారు.

ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తనను తాను రక్షించుకోవడానికి వెనుకాడబోనని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే, నేను మళ్ళీ పోలీసుల దగ్గరకు వెళ్ళను. నేనే స్వయంగా ఆయుధం పట్టి, దీనికి కారణమైన వారిని అంతం చేస్తాను. ఆ తర్వాత జరిగే పరిణామాలకు నా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన వారే బాధ్యులు అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

ఇదిలా ఉండగా, మార్చి 18న‌, ఈ నెల 27న జరగనున్న శ్రీ రామనవమి శోభాయాత్రే తనకు చివరిదని, ఆ రోజున తనను చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఆ లేఖలో హెచ్చరించారు. రాజాసింగ్.. మార్చి 27 నీకు చివరి రామనవమి. తెలంగాణ పోలీసులు నన్ను ఏమీ చేయలేరని లేఖలో పేర్కొనడం గమనార్హం. పదేపదే ఫోన్ కాల్స్, లేఖల ద్వారా తనను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిని గుర్తించాలని ఆయన ముఖ్యమంత్రి, డీజీపీ, పోలీసు కమిషనర్‌లను రాజాసింగ్ కోరారు.