
ప్రాణం తీసిన భూవివాదం
మధ్యప్రదేశ్ రాష్ట్రం భీంద్ జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. పొరుగువారితో ఉన్న పాత వివాదం హత్యకు దారితీసిన ఘటనలో ఒక దళితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామమంతా ఆందోళనలో మునిగిపొయింది. ఇక పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారీగా బలగాలను మోహరించారు.
పోలీసుల వివరాల ప్రకారం మృతుడు రుద్రప్రతాప్ సింగ్ జాటవ్ (35) అనే దళితుడు. అతను డబో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అతనికి పొరుగువారైన కౌరవ్ కుటుంబంతో భూవివాదం కొనసాగుతున్నాయి. ఈ విభేదం శనివారం సాయంత్రం మల్లి గొడవగామారి అది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. కాగా జరిగిన ఘర్షణలో ప్రతాప్ తీవ్ర గాయాలపాలై మరణించాడు.
గ్రామస్తుల కథనం మేరకు కౌరవ్ కుటుంబానికి చెందిన రన్వీర్, ఆశు, ప్రహ్లాద్, రాజీవ్, కున్వర్ సింగ్ అనే ఐదుగురు వ్యక్తులు రుద్రప్రతాప్‌పై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రుద్రప్రతాప్ తీవ్రంగా గాయపడగా మధ్యలో అడ్డుకుందామన్న ఒక వృద్ధుడు కూడా గాయపడ్డాడు.
తీవ్ర గాయాలతో ఉన్న రుద్రప్రతాప్‌ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, గ్వాలియర్‌లోని పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే, చికిత్స కోసం తరలిస్తుండగానే అతడు మార్గమధ్యంలో మృతి చెందాడు. ఇక మరోవైపు ప్రతాప్ మరణించాడనే వార్త తెలుసుకున్న గ్రామస్థులు బంధువులు తీవ్ర ఆగ్రహానికి లోనై నిందితుల ఇళ్లపై దాడి చేసి, ఒక ఇల్లు, కారు, మోటార్‌సైకిల్‌ను తగలబెట్టారు. ఈ ఘటనతో గ్రామమంతా ఉద్రిక్తంగా మారింది.
ఇక సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ ఆసిత్ యాదవ్, డీఎస్పీ సంజీవ్ పాఠక్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంతేకాక ఉద్రిక్తతను అదుపు చేయడానికి సమీప పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను గ్రామంలో మోహరించి గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు.
మరోవైపు పోలీసులు ఐదుగురు నిందితులపై భారతీయ న్యాయ సంహిత కింద హత్య, సామూహిక హింస, ఉమ్మడి ఉద్దేశం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ సంజీవ్ పాఠక్ మాట్లాడుతూ ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని ఆయన పేర్కొన్నారు.
ఈ సంఘటనతో మరోసారి మధ్యప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న హింసకు సంబంధించిన సమస్య వెలుగులోకి వచ్చింది. కాగా భీంద్ జిల్లాలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గత వారం ఒక 25 ఏళ్ల దళిత యువకుడు మాజీ యజమాని వద్ద డ్రైవర్‌గా పనిచేసి వదిలేయడంతో, అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసి, మూత్రం త్రాగించడంతో పాటు తీవ్రంగా హింసించిన సంఘటన కలకలం రేపింది.
