
ప్రాణం తీసిన పాత కక్షలు
స్నేహం అనేది నమ్మకం, అండదండల ప్రతీకగా భావిస్తారు. కానీ మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక సంఘటన మాత్రం ఆ నమ్మకాన్ని పూర్తిగా మార్చేసింది. బివాండీ పట్టణంలోని న్యూ ఆజాద్ నగర్‌లో శనివారం రాత్రి 25 ఏళ్ల యువకుడిని అతని స్నేహితులే హత్య చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల సమాచారం ప్రకారం బాధితుడు తన స్నేహితులతో కలిసి ఇంటి దారి పట్టాడు. నడుస్తూ ఉండగా గతంలో జరిగిన ఒక విభేదంపై మళ్లీ చర్చ మొదలైంది.ఆ చర్చ మధ్యలో మాటామాటా పెరిగి క్షణాల్లోనే పరిస్థితి హింసాత్మకంగా మారింది. కోపం ఆవేశానికి లోనైన నిందితులు అతడిని క్రూరంగా కొట్టాడు. ఆఘర్షణలో తీవ్రగాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న శాంతినగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఐదుగురిపై హత్య కేసు నమోదు చేశారు. వారిలో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇద్దరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
స్థానికులు చెబుతున్న దాని ప్రకారం బాధితుడు నిందితుల మధ్య పాత గొడవలు కొంతకాలంగా కొనసాగుతున్నాయి. చిన్న చిన్న గొడవలు సమయానికి శాంతించకపోవడం చివరికి ఈ దారుణానికి దారితీసిందని అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనతో బివాండీ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
యువతలో పెరుగుతున్న కోపం, ఆవేశం, చిన్న చిన్న విభేదాలను హింసాత్మకంగా పరిష్కరించాలనే ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఒకప్పుడు స్నేహితులుగా తిరిగినవారు ఇప్పుడు ప్రాణహంతకులుగా మారడం సమాజానికి ఒక హెచ్చరికలాంటిదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
