Let's talk: editor@tmv.in
ప్రాజెక్ట్ చీతా: భారత్‌కు ఎనిమిది బోట్స్‌వానా చిరుతల రాక‌

ప్రాజెక్ట్ చీతా: భారత్‌కు ఎనిమిది బోట్స్‌వానా చిరుతల రాక‌

Shaik Mohammad Shaffee
13 నవంబర్, 2025

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల బోట్స్‌వానా పర్యటనలో భాగంగా, భారతదేశం-బోట్స్‌వానా దేశాలు బుధవారం రోజున చీతాల తరలింపు ఒప్పందంను లాంఛనంగా ప్రకటించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఆఫ్రికా దేశమైన బోట్స్‌వానా నుంచి ఎనిమిది చీతాలను భారత్‌కు తరలించనున్నారు. బోట్స్‌వానా అధ్యక్షుడు డూమా గిడియన్ బోకోతో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారులలో ఒకటైన బోట్స్‌వానా, ఈ చీతాలను భారత్‌కు పంపించే గొప్ప సంకేతానికి గాను, రాష్ట్రపతి ముర్ము బోట్స్‌వానా ప్రజలకు, అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ "భారత ప్రభుత్వం చేపట్టిన విశిష్ట వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమం అయిన 'ప్రాజెక్ట్ చీతా'లో భాగంగా బోట్స్‌వానా చీతాలను భారతదేశానికి పంపడం నాకు ప్రత్యేక ఆనందాన్ని ఇస్తోంది. మేము వాటిని (చీతాలను) బాగా చూసుకుంటాం" అని హామీ ఇచ్చారు. నేడు ఇరు దేశాధినేతలు హాజరయ్యే ఒక కార్యక్రమంలో పట్టుకున్న ఎనిమిది చీతాలను మొకొలోడి నేచర్ రిజర్వ్‌లోని క్వారంటైన్ కేంద్రంలోకి విడుదల చేస్తారు. ఇది చీతాలను భారత్‌కు లాంఛనంగా అప్పగించే ప్రక్రియకు నాంది పలుకుతుంది.

బోట్స్‌వానాలోని కలహారి ఎడారిలో ఉన్న ఘన్జి పట్టణం నుండి ఈ చీతాలను గాబరోన్‌కు సమీపంలో ఉన్న మొకొలోడి నేచర్ రిజర్వ్‌కు తరలించారు. ఈ తరలింపుతో భారతదేశంలో చీతాల సంఖ్యను పెంచేందుకు, జన్యు వైవిధ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న ప్రాజెక్ట్ చీతా ప్రయత్నాలకు కొత్త బలం చేకూరినట్లయింది. దక్షిణ ఆఫ్రికాలోని ఈ దేశాన్ని భారత రాష్ట్రపతి సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చారిత్రక పర్యటన కేవలం దౌత్య సంబంధాలను మాత్రమే కాక, వన్యప్రాణుల సంరక్షణ వంటి ఉమ్మడి అంశాలపై ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పటిష్టం చేసింది.

ప్రాజెక్ట్ చీతా

ప్రాజెక్ట్ చీతా.. భారతదేశంలో 1952లో అంతరించిపోయిన చిరుతలను తిరిగి ప్రవేశపెట్టే వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్‌ను భారత ప్రభుత్వం 2020లో ప్రారంభించింది. 2022లో నమీబియా నుండి 8 చిరుతలను, 2023లో దక్షిణ ఆఫ్రికా నుండి 12 చిరుతలను తీసుకువచ్చి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌‌లో విడిచారు. 2025లో బోట్స్‌వానా నుండి మరిన్ని చిరుతలు రానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం పర్యావరణ సమతుల్యత పునరుద్ధరించడం, వన్యప్రాణి పర్యాటకాన్ని పెంచడం, చిరుతల జాతిని సంరక్షించడం. ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తోంది.

ప్రాజెక్ట్ చీతా: భారత్‌కు ఎనిమిది బోట్స్‌వానా చిరుతల రాక‌ - Tholi Paluku