Let's talk: editor@tmv.in
ప్రాజెక్టుల పంపులు, మోటార్లతో చెలగాటం వద్దు: హరీశ్ రావు

ప్రాజెక్టుల పంపులు, మోటార్లతో చెలగాటం వద్దు: హరీశ్ రావు

Gaddamidi Naveen
9 ఏప్రిల్, 2026

తెలంగాణలోని భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయ‌న‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదేపదే ఆన్, ఆఫ్ చేయడం ద్వారా అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

భారీ నీటి పారుదల మోటార్లు నిరంతరాయంగా పనిచేసేలా డిజైన్ చేయబడినవని, వాటిని ఇష్టానుసారం ఆన్, ఆఫ్ చేయడం ఇంజనీరింగ్ ప్రమాణాలకు విరుద్ధమని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల వైబ్రేషన్లు ఏర్పడి పంపులు, ఇంపెలర్లు, మోటార్లు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది యాదృచ్ఛికం కాదని, ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడుచేస్తూ, దానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బాధ్యులను చేయాలనే ప్రయత్నమా అని ప్రశ్నించారు.

చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 ప్రాంతాల్లో మోటార్ల ఆపరేషన్ తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా వినియోగించడం బాధాకరమని అన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక కావాలనే చేస్తున్న చర్యలా అనుమానాలు వ్యక్తం చేశారు. తక్షణమే ఈ అశాస్త్రీయ విధానాన్ని నిలిపివేసి, ఇంజనీరింగ్ నిబంధనలకు అనుగుణంగా మోటార్లను నిరంతరాయంగా నడపాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడవద్దని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రాజెక్టుల పంపులు, మోటార్లతో చెలగాటం వద్దు: హరీశ్ రావు - Tholi Paluku