
ప్రాంతీయ అభివృద్ధికి రాయ్‌పూర్–విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్
మధ్య భారతదేశాన్ని తూర్పు తీరంలోని విశాఖపట్నం పోర్టుతో నేరుగా అనుసంధానించేందుకు రూపొందించిన రాయ్‌పూర్–విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారతమాల పరియోజనలో మొదటి దశలో చేపట్టిన ఈ ప్రముఖ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ పరిశ్రమల అభివృద్ధి, వాణిజ్య విస్తరణ, ప్రాంతీయ కనెక్టివిటీకి కీలకంగా నిలవనుంది.
464 కిలోమీటర్ల పొడవుతో, ఆరు లేన్లుగా పూర్తిగా కొత్త మార్గంలో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ హైవే దాదాపు రూ. 20,000 కోట్లతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటోంది. వన్యప్రాణుల కదలికలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక వైల్డ్‌లైఫ్ కారిడార్‌లు ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్‌లో మరో ముఖ్యాంశం.
దూరం తగ్గి… సమయం మిగిలి
ప్రస్తుతం నేషనల్ హైవే -26 ద్వారా రాయ్‌పూర్–విశాఖపట్నం ప్రయాణానికి సుమారు 597 కిలోమీటర్లు, 12 గంటల సమయం పడుతోంది. కొత్త ఆర్థిక కారిడార్‌తో దూరం 132 కిలోమీటర్లు తగ్గి 465 కిలోమీటర్లకు చేరనుంది. దీంతో ప్రయాణ సమయం కేవలం 5 గంటలకు తగ్గుతుందనే అంచనా. అంతేకాక ఇంధన వినియోగం తగ్గడంతో పాటు, సరుకు, ప్రజా రవాణాదారులకు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
మూడు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదం
ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాలు, ఒడిశా ఖనిజ వనరులు, ఆంధ్రప్రదేశ్ కొండ ప్రాంతాల గుండా ఈ కారిడార్ నిర్మాణం కొనసాగుతోంది. దీని ద్వారా ధమ్తరి, కేశ్కాల్, కాంకేర్ (ఛత్తీస్‌గఢ్), బోరిగుమ్మ, నవరంగ్‌పూర్, కొరపుట్ (ఒడిశా), అరకు, విజయనగరం (ఆంధ్రప్రదేశ్) వంటి గిరిజన, వెనుకబడిన జిల్లాలు ప్రధాన మార్కెట్లు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలతో మరింత వేగంగా అనుసంధానమవుతాయి.
పోర్ట్ కనెక్టివిటీలతో పరిశ్రమలకు ఊపిరి
కారిడార్ పూర్తయిన తర్వాత ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిశాలోని పరిశ్రమలు విశాఖపట్నం పోర్టుకు నేరుగా చేరే అవకాశం ఉంటుంది. చెన్నై–కొల్‌కతా జాతీయ రహదారితో అనుసంధానం మెరుగై, ఎగుమతులు, వాణిజ్యం, సరఫరా గొలుసుల సామర్థ్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
లారీ యజమానులకు, డ్రైవర్లకు ఉపశమనం
రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నం వరకు తరచూ సరుకులు తరలించే లారీ యజమానులు కొత్త రహదారి వల్ల ప్రయాణ భారం తగ్గుతుందని చెబుతున్నారు. మునుపు ప్రయాణానికి ఒకటిన్నర రోజు పట్టేది. ఇప్పుడు పగలు బయలుదేరినా రాత్రికే చేరగలుగుతున్నాం. ఇంధన ఖర్చు, వాహనాల దెబ్బతినే సమస్యలు తగ్గుతున్నాయి అని ఒక రవాణాదారు తెలిపారు.
రాయ్‌పూర్–విశాఖ ఎకానమిక్ కారిడార్ ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో భూమీ విలువలు భారీగా పెరిగి, స్థానిక రైతుల్లో ఆనందం నెలకొంది. మా భూముల ముందు విలువ ఎకరాకు రూ.15 లక్షలు. ఇప్పుడు దాదాపు రూ.1.5 కోట్లకు చేరింది. దీంతో రైతులంతా సంతోషంగా ఉన్నారు అని ప్రాజెక్టు ప్రాంతానికి చెందిన ఒక రైతు తెలిపారు. విజయనగరం జిల్లా జామి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, “రహదారికి 1.10 ఎకరాలు ఇచ్చాను. న్యాయమైన పరిహారం లభించింది. మిగిలిన భూమి ధర మరింత పెరిగింది అని అన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే పట్ల ప్రజల్లో భారీ స్థాయిలో ఆశలు పెరుగుతున్నాయి.
సురక్షిత ప్రయాణానికి కొత్త అధ్యాయం
గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అనువుగా రూపొందించిన ఈ కొత్త 6-లైన్ల రహదారి, పాత నేషనల్ హైవే-26పై రద్దీని తగ్గిస్తుంది. ఇది ప్రయాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా మరింత సురక్షితం చేస్తుందని అధికారులు తెలిపారు.
ఆరు లేన్ల రాయ్‌పూర్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌వేను 2014లో భారత్‌మాల పరియోజన పరిధిలో ప్రతిపాదించగా, 2017లో కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
భవిష్యత్తులో ఈ ఎక్స్‌ప్రెస్‌వేను తూర్పు ఆర్థిక కారిడార్‌తో అనుసంధానించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఈ కారిడార్ బీహార్‌లోని రక్సౌల్ నుంచి ఒడిశా వరకు, బీహార్–నేపాల్ సరిహద్దు ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది.
ప్రాజెక్ట్ పూర్తయ్యాక, రాయ్‌పూర్ నుండి విశాఖపట్నం వరకు ప్రయాణ సమయం ఏడు గంటల వరకు తగ్గి, రవాణా, వాణిజ్యం, పారిశ్రామిక కనెక్టివిటీలకు భారీగా లాభం చేకూరనుంది.
