Let's talk: editor@tmv.in
‘ప్రసాద్‌’ పథకంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయం

‘ప్రసాద్‌’ పథకంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయం

Gaddamidi Naveen
17 డిసెంబర్, 2025

బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ‘ప్రసాద్‌’ పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న ప్రసిద్ధ బాల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం నూతన అన్నదానం కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు, ఇతర వసతుల స్థాయిని పెంచే పనులు ప్రారంభమయ్యాయి.

ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం రూ.4.2 కోట్ల వ్యయంతో మంజూరు చేసిందని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ప్రధానంగా భక్తుల సౌకర్యాలు, భద్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఈ అభివృద్ధి పనులను రూపొందించారు. నిర్మాణంలో భాగంగా తొలి, రెండో అంతస్తుల్లో విశాలమైన అన్నదానం హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ప్రతిరోజూ వందలాది మంది భక్తులకు శుభ్రంగా, సక్రమంగా అన్నదానం అందించే అవకాశం కలుగుతుందని ఆయ‌న‌ పేర్కొన్నారు.

భక్తుల కోసం అత్యాధునిక సౌకర్యాలు

మూడో అంతస్తులో ఆధునిక కాఫెటీరియా/క్యాంటీన్ ఏర్పాటు చేయనుండగా, స్టిల్ట్ ఫ్లోర్‌లో మహిళలు, పురుషులకు వేర్వేరుగా బయో టాయిలెట్లు, వాహనాల కోసం పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు కూర్చోవడానికి బెంచీలు, వేచి ఉండే ప్రాంతాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ హిత అభివృద్ధిలో భాగంగా సోలార్ ప్యానెలింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆటోమేటిక్ ఫైర్ అలారం సిస్టమ్, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు, తాగునీటి సౌకర్యాలు, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం స్పష్టమైన సైనేజ్ బోర్డులు, సీసీటీవీ నిఘా వ్యవస్థతో మరింత సురక్షితంగా మారనుంది.

ఈ అభివృద్ధి పనుల ద్వారా బాల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడనుందని. అంతేకాకుండా, ప్రాంతీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విధంగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉందని ఆయ‌న ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

‘ప్రసాద్‌’ పథకంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయం - Tholi Paluku