Let's talk: editor@tmv.in
ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే: కేటీఆర్

ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే: కేటీఆర్

Gaddamidi Naveen
8 ఏప్రిల్, 2026

తెలంగాణలో రైతుల భూసేకరణ అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు ముదిరింది. భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపడానికి వెళ్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలను గృహనిర్బంధం చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు "పిరికిపంద చర్య" అని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు.

వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గ పరిధిలోని కడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో ప్రతిపాదిత పారిశ్రామిక పార్క్ కోసం సుమారు 1,200 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలకు మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు.

భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న మాజీ మంత్రులు టి. హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్‌లను పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధం చేయడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమాన్ని విస్మరించి, భూములను లాక్కోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. గత రెండేళ్లలో ఒక్క భారీ పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాని ఈ ప్రభుత్వం, రైతుల భూములను లాక్కోవడంలో మాత్రం దొంగల్లా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజల కోసం నిలబడే నాయకులను అణగదొక్కడం ద్వారా ప్రశ్నించే గొంతుల‌ను అణిచివేయాలని చూస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హతమార్చడమే అని కేటీఆర్ మండిపడ్డారు.

ఆరు గ్యారీల వైఫల్యం

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో, రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేక, ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ పరిశ్రమల పేరుతో భూములు సేకరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

బెదిరింపులకు భయపడం

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ నాయకత్వానికి అరెస్టులు, జైళ్లు కొత్త కాదని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమందిని నిర్బంధించినా మేము భయపడే ప్రసక్తే లేదు. ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. పోలీసు బలగాలను ఉపయోగించి ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూడటం పిరికితనం అని ఆయన పేర్కొన్నారు. బలవంతపు భూసేకరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ అణచివేత ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, రైతుల భూములను కాపాడే వరకు తమ పోరాటం ఆగదని కేటీఆర్ హెచ్చరించారు.