Let's talk: editor@tmv.in
ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
29 జులై, 2026

ప్రశ్నాపత్రాల లీకేజీలకు కారణమైన బాధ్యులపై అత్యంత కఠినంగా శిక్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని, ఆఫ్‌లైన్‌ విధానంలోనే లీకేజీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

దేశంలో ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కోచింగ్ సెంటర్లే ప్రశ్నాపత్రాల లీకేజీలకు వేదికలుగా మారుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విద్యా అక్రమాల నివారణకు దేశవ్యాప్తంగా ఒకే జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, విద్యను రాష్ట్రాల పరిధిలోనే ఉంచితే పొరపాట్లకు అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరగాలని ఆకాంక్షించారు.

యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టడం వల్లే తమ ప్రభుత్వం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించగలిగిందని సీఎం తెలిపారు. గ్లోబరీనా వంటి అక్రమాలకు పాల్పడిన సంస్థలపై గతంలో చర్యలు తీసుకోకపోవడం వల్లే అవి సీబీఎస్‌ఈ స్థాయి వరకు విస్తరించి రచ్చ చేశాయని, ఇటువంటి సంస్థలపై కఠిన చర్యలు తప్పవన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ & హైడ్రాపై స్పష్టత

ఫీజురీయింబర్స్‌మెంట్ కు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం రూ.8వేల కోట్లను బకాయిలను పెట్టి పోయింద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి వసతులు లేకుండా, దొంగ లెక్కలు చూపించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కొట్టేయాలనుకునే సంస్థలమీద విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ సాగుతోంద‌ని సీఎం తెలిపారు. స‌క్ర‌మంగా ఉన్న‌వాళ్ల‌కు బ‌కాయిలు చెల్లిస్తామ‌ని ఓ ప్ర‌శ్న‌కు సీఎం బ‌దులిచ్చారు. కేసీఆర్ పెట్టిన బకాయిలే త‌మ‌కు భారంగా మారాయ‌న్నారు. తాము ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదన్నట్లుగా, మా ప్రభుత్వం కారణమన్నట్లుగా బీఆర్ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోంద‌ని, దానికి బీజేపీ వంత‌పాడుతోంద‌ని సీఎం మండిప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఫీజు బ‌కాయిల‌పై బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణ‌య్య ఎందుకు మాట్లాడ‌డం లేద‌ని సీఎం ప్ర‌శ్నించారు.

కూట‌మి ప్ర‌భుత్వం ఉన్న ఏపీలో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయించిన తర్వాత తెలంగాణలో డిమాండ్ చేస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, ఆర్.కృష్ణయ్యల‌కు సూచిస్తున్న‌ట్లు సీఎం తెలిపారు. గత ప్రభుత్వ బకాయిలు భారంగా ఉన్నప్పటికీ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇకపై ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందించామని, అవసరమైతే ముందుగానే బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది రూ.2,200 కోట్ల నుంచి రూ.2,400 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవసరమవుతాయని, ఆ నిధులను క్రమం తప్పకుండా విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

హైడ్రా పనితీరుపై స్పందిస్తూ, చెరువులు, నాలాలు, కుంట‌లు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పార్క్‌లను కబ్జాలు పెట్టుకున్నోళ్లు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే, గతంలో సోమేశ్‌కుమార్ మీద 400 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులున్నాయ‌ని, అప్పుడు ఎందుకు మాట్లాడ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం విచక్షణాధికారమ‌ని, దానిని ఎవరూ గుంజుకోలేర‌ని సీఎం అన్నారు.ప్రభుత్వానికి దాని బాధ్యతలు, కార్యాచరణపై పూర్తి స్పష్టత ఉందని సీఎం పేర్కొన్నారు. హైకోర్టు తాజా ఆదేశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వ స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. న్యాయస్థానాలను గౌరవిస్తూనే, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
RevanthReddyTelanganaQuestionPaperLeakExamReformsEducationReformsTransparentExamsTGPSCStudentsFirstFeeReimbursementEducationPolicyHYDRAATelanganaNews
ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku