Let's talk: editor@tmv.in
ప్రశాంతంగా హోలీ జరుపుకోవాలి: సీపీ సజ్జనార్

ప్రశాంతంగా హోలీ జరుపుకోవాలి: సీపీ సజ్జనార్

Gaddamidi Naveen
3 మార్చి, 2026

నగరంలో హోలీ పండుగను ప్రజలందరూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. బ్లూ కోట్స్, పెట్రోలింగ్ సిబ్బంది నగరమంతా నిరంతరం గస్తీ నిర్వహించాలని తెలిపారు. ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు పూయడం, పాదచారులు లేదా వాహనాలపై రంగులు చల్లడం సహించబోమని స్పష్టం చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందని చెప్పారు.

రసాయన రంగులకు బదులుగా సహజసిద్ధమైన రంగులను వినియోగించాలని సూచించారు. వేడుకలలో డీజేలకు అనుమతి లేదని, రోడ్లపై గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ సృష్టిస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఆయ‌న‌ హెచ్చరించారు. రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

హోలీ రోజున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయ‌న‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఆయ‌న‌ సూచించారు.

ప్రశాంతంగా హోలీ జరుపుకోవాలి: సీపీ సజ్జనార్ - Tholi Paluku