
ప్రవక్త పై ప్రేమను చూపాల్సిన అవసరం లేదు
ప్రవక్త పై ప్రేమను ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదని, మసీదులలో నమాజ్ తరువాత మిగతా ఏ కార్యక్రమాన్ని నిర్వహించవద్దని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ముస్లిం సమాజాన్ని కోరారు. ప్రస్తుతం ‘ఐ లవ్ ముహమ్మద్’ పేరుతో కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొడతున్నారని వాపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వెలువెత్తిన నిరసనల వల్ల సమాజం విచ్చిన్నమవుతుందని సూచించారు. ఇస్లామిక్ పండితులు ఈ నిరసనలపై ఆలోచించాలని, మసీదుల్లో నమాజులు తప్పా మిగతావి చేయడాన్ని ఆపమని అభ్యర్థించారు.
తప్పుదారి పట్టకండి
ఈ సందర్భంగా ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్ని గ్రూపులు ప్రజలను రెచ్చగొడుతున్నాయి. నాటకమాడుతున్నాయి. ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ప్రజలు బయటకు ఎందుకొస్తున్నారు. ఈ విద్వేషాల వ్యాప్తి వెనుక కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. దయచేసి తప్పుదారి పట్టకండి. ఈ పని సరైంది కాదు. పోలీసులు మిమ్మల్ని కొట్టినప్పుడు జాలిపడరు. కాల్చినప్పుడు బాధపడరని తెలిపారు. నమాజ్ తరువాత ప్రవక్త ముహమ్మద్ పై ప్రేమ చూపించాల్సిన అవసరం లేదని, మీరు ముస్లిం అయినప్పుడే ముహమ్మద్ పై ప్రేమ ఉందని ఆర్థం అన్నారు. అయినా ప్రవక్త పై ప్రేమలేని ముస్లిం లేడు. ఆయనపై ప్రేమ లేకుండా ఎప్పటికీ ముస్లిం కాలేడని గుర్తు చేశారు. ప్రవక్త పై ప్రేమ అంటే ఆయన సూచించిన మార్గంలో నడవడమని ఎంపీ మసూద్ అన్నారు. ప్రవక్తను ప్రేమించడం అంటే నిరసనలు తెలపడం కాదని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ధార్మిక వేత్తలపై ఉందని గుర్తు చేశారు. మసీదుల్లో నమాజులు మాత్రమే చదవాలని ఈ సందర్భంగా మరోసారి వివరించారు.
