
ప్రయాణికుల భద్రతే మా ప్రథమ ధ్యేయం: తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ తమ ప్రయాణికులను సురక్షితంగా, సుఖంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంలో నిరంతరం కృషి చేస్తోంది. మీ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, సంస్థ వివిధ రకాల బస్సులలో అత్యంత ఆధునిక భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసిందని అధికారులు తెలిపారు.
ప్రధాన భద్రతా చర్యల వివరాలు
టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సులైన లహరి ఏసీ స్లీపర్, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ అలాగే రాజధాని ఏసీ బస్సులలో అత్యాధునిక రక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
• వెనుక భాగంలో అత్యవసర ద్వారం
• అద్దాలు పగులగొట్టేందుకు సుత్తెలు , ఫైర్ ఎక్స్‌టింగిషర్‌లు.
• ముఖ్యంగా,డ్రైవర్ క్యాబిన్‌లో మంటలను త్వరగా గుర్తించి, ఆర్పేందుకు ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్, సప్రెషన్ సిస్టమ్ అమర్చబడింది.
• ప్రమాద సమయంలో ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు సైరన్ కూడా పొందుపరచబడింది.
ఇతర బస్సులలో భద్రత
సూపర్ లగ్జరీ బస్సులలో ఫైర్ ఎక్స్‌టింగిషర్, బస్సు వెనుక భాగంలో కుడి వైపున అత్యవసర ద్వారం ఏర్పాటు చేయబడింది. అలాగే డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో సైతం కుడి వైపు వెనుక భాగంలో అత్యవసర ద్వారం, ఫైర్ ఎక్స్‌టింగిషర్‌లు అందుబాటులో ఉన్నాయి.
మీరు మాపై ఉంచిన ఆదరణ, విశ్వాసం మాకు కొండంత అండ. ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖప్రదం అని ధైర్యంగా తెలియజేస్తున్నాము. ఈ భద్రతా ఏర్పాట్లను గమనించి అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు ప్రయాణికులు సహకరించగలరని అధికారులు పేర్కొన్నారు.
