
ప్రయాణికులపై ఎయిర్ ఇండియా సర్‌చార్జ్ పెంపు
అంతర్జాతీయంగా జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఎయిర్‌ఇండియా దేశీయ, అంతర్జాతీయ విమాన మార్గాలపై ఫ్యూయల్ సర్‌చార్జ్‌ను పెంచింది. ఇటీవల జెట్ ఫ్యూయల్ ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు ఇటీవలి సంవత్సరాల్లో అత్యంత కఠినమైన ఇంధన వ్యయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఇంటర్‌నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తాజా గణాంకాల ప్రకారం, 2026 మార్చి 27తో ముగిసిన వారానికి గ్లోబల్ సగటు జెట్ ఇంధన ధర బ్యారెల్‌కు 195.19 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి చివరలో ఇది 99.40 డాలర్లుగా ఉండగా, కొద్ది వారాల్లోనే దాదాపు 100 శాతం పెరిగింది. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు రిఫైనరీ మార్జిన్లు (క్రాక్ స్ప్రెడ్) భారీగా పెరగడం కూడా దీనికి కారణమని సంస్థ తెలిపింది.
దేశీయ విమానాల విషయంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఫ్లాట్ సర్‌చార్జ్ విధానాన్ని రద్దు చేసి, ఏప్రిల్ 8 నుంచి దూరాన్ని ఆధారంగా చేసుకుని కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ విధానం ప్రకారం 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి ప్రతి ప్రయాణికుడిపై రూ.299, 2,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణానికి రూ.899 వరకు సర్‌చార్జ్ వసూలు చేయనున్నారు. అంతర్జాతీయ విమానాల విషయంలో ఇంధన ధరలపై ఎలాంటి పరిమితులు లేకపోవడంతో సర్‌చార్జ్ పెంపు మరింతగా ఉండనుందని సంస్థ తెలిపింది. అయినప్పటికీ ఈ పెంపు పెరిగిన ఇంధన వ్యయాలను పూర్తిగా భర్తీ చేయలేదని ఎయిర్ ఇండియా పేర్కొంది.
