Let's talk: editor@tmv.in
ప్రయాగ్‌రాజ్​ లో భక్త ’జన‘ సందోహం

ప్రయాగ్‌రాజ్​ లో భక్త ’జన‘ సందోహం

Pinjari Chand
19 జనవరి, 2026

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మాఘ మేళాలో భాగంగా మౌని అమావాస్య పర్వదినాన ఆదివారం మధ్యాహ్నం వరకు 3.15 కోట్లకుపైగా భక్తులు గంగా నదిలో, సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి నుంచే తీవ్రమైన పొగమంచును లెక్కచేయకుండా భక్తులు గంగ, సంగమ ఘాట్లకు తరలివచ్చారని మేళా పరిపాలనాధికారి ఒకరు తెలిపారు. తెల్లవారుజామున నుంచే అన్ని దిశల నుంచీ భక్తుల రాక కొనసాగిందన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం హెలికాప్టర్ ద్వారా భక్తులపై పుష్పవర్షం కురిపించారు.ఇంతకుముందు మకర సంక్రాంతి రోజున సుమారు 1.03 కోట్ల మంది, ఏకాదశి రోజున దాదాపు 85 లక్షల మంది గంగా–సంగమంలో స్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

సదుపాయాలు కల్పించాం

డివిజనల్ కమిషనర్ సౌమ్య అగర్వాల్ మాట్లాడుతూ, భక్తులకు మార్గదర్శనం కోసం మేళా ప్రాంతమంతా స్తంభాలపై ప్రతిఫలించే టేపులు ఏర్పాటు చేశామని, సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను నియమించామని తెలిపారు. మాఘ మేళా 800 హెక్టార్ల విస్తీర్ణంలో, ఏడు విభాగాలుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పరిశుభ్రత కోసం 25 వేలకుపైగా మరుగుదొడ్లు, 3,500 మంది పారిశుధ్య సిబ్బందిని మోహరించామని తెలిపారు. తాత్కాలిక కల్పవాసం చేసే భక్తులు, పర్యాటకుల కోసం ధ్యానం–యోగ సదుపాయాలతో కూడిన టెంట్ సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల రాకపోకలకు బైక్ ట్యాక్సీలు, గోల్ఫ్ కార్టులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మాఘ మేళా ఎస్పీ నీరజ్ పాండే మాట్లాడుతూ భద్రత, రద్దీ నియంత్రణ కోసం 10 వేల మందికిపైగా పోలీసు సిబ్బందిని మోహరించామని తెలిపారు. వాహనాల నియంత్రణకు 42 తాత్కాలిక పార్కింగ్ కేంద్రాలు, లక్షకు పైగా వాహనాల పార్కింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ మేళాకు మొత్తం 12,100 అడుగుల పొడవైన స్నాన ఘాట్లు నిర్మించామని అధికారులు తెలిపారు.

ప్రజల సంక్షేమం కోరుకుంటున్నా: ప్రియాంక గాంధీ

మౌని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ సంక్షేమం చేకూరాలని ఆకాంక్షిస్తున్నానని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తపస్సు, త్యాగం, ధ్యానం, దానానికి అంకితమైన పవిత్రమైన మౌని అమావాస్య పర్వదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. అలాగే అందరి క్షేమం కోసం తన ఆకాంక్షలు, ప్రార్థనలు కొనసాగుతున్నాయని తెలిపారు. పండుగ శుభాకాంక్షలతో కూడిన గ్రాఫిక్‌ను పోస్ట్ చేసిన ఆమె, మోక్షదాయిని మాత గంగా దేశ ప్రజలందరికీ సంక్షేమాన్ని ప్రసాదించుగాక… హర్ హర్ గంగే! అని తన సందేశంలో పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మౌని అమావాస్య సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సంగమంలో పుణ్యస్నానానికి వచ్చిన భక్తులకు స్వాగతం పలుకుతూ ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. విశ్వాస మహోత్సవమైన మౌని అమావాస్య పవిత్ర సందర్భంగా సంగమానికి వచ్చిన అఖాడాలు, ధర్మాచార్యులు, సంతులు, సాధకులు, కల్పవాసులు, భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతమని ఆయన పేర్కొన్నారు.