
ప్రయాగ్‌రాజ్‌లో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు
తీవ్రమైన చలి పరిస్థితులను లెక్కచేయకుండా, మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లోని గంగ నది, త్రివేణి సంగమంలో సుమారు 1.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని అధికారులు తెలిపారు. మాఘ మేళా అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం, భక్తులు అర్ధరాత్రి నుంచే మేళా ప్రాంతానికి చేరుకోవడం ప్రారంభించగా, మధ్యాహ్నం 12 గంటల నాటికి దాదాపు 1.5 కోట్ల మంది గంగలో, సంగమంలో స్నానాలు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ మనిష్ కుమార్ వర్మ మాట్లాడుతూ మాఘ పౌర్ణమి రోజుతో కల్పవాసులు నిర్వహించే నెల రోజుల కల్పవాస వ్రతానికి చివరి పుణ్యస్నానం పూర్తవుతుందని తెలిపారు. నెల రోజులుగా మాఘ మేళాలో కల్పవాసం చేస్తున్న భక్తులను తీసుకెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చినట్లు చెప్పారు. ఉదయం తీవ్రమైన పొగమంచు ఉన్నప్పటికీ, భక్తుల రాక కొనసాగిందని, అన్ని ఘాట్ల వద్ద స్నానాలు సజావుగా జరుగుతున్నాయని వర్మ పేర్కొన్నారు.
భద్రతా ఏర్పాట్లలో భాగంగా మేళా ప్రాంతమంతా ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించడంతో పాటు, ప్రతి ఘాట్ వద్ద పడవలతో పడవకారులు, గజఈతగాళ్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఘాట్ల వద్ద తగినంత వస్త్రాలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయగా, మేళా ప్రాంతమంతటిని సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. త్రివేణి సంగమ ఆరతి సేవా సమితి అధ్యక్షుడు ఆచార్య రాజేంద్ర మిశ్రా మాట్లాడుతూ సుమారు ఐదు లక్షల మంది కల్పవాసులు మాఘ పౌర్ణమి స్నానంతో తమ వ్రతాన్ని ముగిస్తారని తెలిపారు. ఈ మాఘ మేళా ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పుణ్యస్నానంతో ముగుస్తుందని ఆయన చెప్పారు.
డివిజనల్ కమిషనర్ సౌమ్య అగర్వాల్ మాట్లాడుతూ, మాఘ మేళా ఏడు సెక్టార్లలో 800 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్వహిస్తున్నామని, భక్తుల సౌకర్యార్థం 25 వేలకుపైగా మరుగుదొడ్లు నిర్మించి, 3,500కు పైగా పారిశుద్ధ్య కార్మికులను నియమించామని తెలిపారు. మాఘ మేళా ఎస్పీ నీరజ్ పాండే మాట్లాడుతూ, భక్తుల భద్రత, రాకపోకలు సజావుగా సాగేందుకు 10,000కుపైగా పోలీసు సిబ్బందిని మోహరించామని చెప్పారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ కోసం లక్షకు పైగా వాహనాలకు సరిపడే సామర్థ్యంతో 42 తాత్కాలిక పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.
