Let's talk: editor@tmv.in
ప్రయాగ్‌రాజ్‌లో మాఘమేళా ప్రారంభం

ప్రయాగ్‌రాజ్‌లో మాఘమేళా ప్రారంభం

Pinjari Chand
4 జనవరి, 2026

పౌష పౌర్ణమి సందర్భంగా శనివారం ప్రయాగ్‌రాజ్‌లో మాఘ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వృద్ధులు, చిన్నపిల్లలతో సహా వివిధ వర్గాలకు చెందిన లక్షలాది మంది భక్తులు తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా సంగమం వద్ద చల్లని నీటిలో పుణ్యస్నానాలు చేశారు. పాప ప్రక్షాళనకు మార్గమని విశ్వసించబడే నెల రోజుల కల్పవాసం కూడా పౌష పౌర్ణమితోనే ప్రారంభమైంది. కల్పవాసం చేసే భక్తులు ప్రతిరోజూ గంగానదిలో రెండుసార్లు స్నానం చేసి, రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు. మిగిలిన సమయాన్ని ధ్యానం, ఆరాధనలో గడుపుతారు. మాఘ మేళా అధికారుల ప్రకారం ఉదయం 10 గంటల వరకు దాదాపు 9 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు.

భక్తులకు హృదయపూర్వక స్వాగతం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందీలో ఎక్స్ లో చేసిన పోస్టులో గంగా మాతకు శతకోటి నమస్సులు. మాఘ మేళా ప్రారంభం, పౌష పౌర్ణమి శుభసందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకూ, భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలని తెలిపారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రయాగ్‌రాజ్‌కు విచ్చేసిన సాధుసంతులు, మతపెద్దలు, అన్ని అఖాడాల సభ్యులు, భక్తులకు హృదయపూర్వక స్వాగతం. గంగా, యమునా, సరస్వతి దేవీమాతలు అందరి కోరికలు నెరవేర్చాలని ప్రార్థిస్తున్నానని యోగి పేర్కొన్నారు. త్రివేణి సంగమ ఆరతి సేవా సమితి అధ్యక్షుడు ఆచార్య రాజేంద్ర మిశ్రా మాట్లాడుతూ, శనివారం నుంచే సుమారు 5 లక్షల మంది భక్తులు కల్పవాసాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. చలి తీవ్రంగా ఉన్న కారణంగా ఉదయం భక్తుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రోజంతా పెరిగే అవకాశముందని చెప్పారు. పౌష పౌర్ణమి పుణ్యస్నానం రోజంతా కొనసాగుతుందని వివరించారు.

ప్రయాగ్ ధామ్ సంఘ్ అధ్యక్షుడు రాజేంద్ర పాలివాల్ మాట్లాడుతూ సాయంత్రం నాటికి కల్పవాసీలు సహా దాదాపు 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేశారు. స్నానానికి శుభ సమయం మధ్యాహ్నం 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు. స్నానం అనంతరం కల్పవాసీలు తమ పూజారుల వద్ద కల్పవాస దీక్ష తీసుకొని మేళా ప్రాంగణంలోనే నివసిస్తారని చెప్పారు. ప్రయాగ్‌రాజ్ డివిజనల్ కమిషనర్ సౌమ్య అగర్వాల్ ప్రకారం, పౌష పౌర్ణమి రోజున గంగా, సంగమంలో 20 నుంచి 30 లక్షల మంది భక్తులు స్నానాలు చేసే అవకాశం ఉంది. మాఘ మేళా కోసం 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 స్నాన ఘాట్లు నిర్మించగా, 9 పాంటూన్ వంతెనలు ఏర్పాటు చేశారు.

మాఘ మేళా మొదటి రోజున కిన్నర్ అఖాడాకు చెందిన కల్యాణి నంద్ గిరి కూడా పుణ్యస్నానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తులు తప్పకుండా సంగమంలో స్నానం చేసి ఆశీర్వాదాలు పొందాలి. భక్తుల సమూహాన్ని చూస్తుంటే ఇది మాఘ మేళా కాకుండా కుంభమేళాలా అనిపిస్తోందని అన్నారు. కిన్నర్ అఖాడా మాఘ మేళాలో మొదటిసారిగా కల్పవాసాన్ని ఆచరిస్తోంది.

కోల్‌కతా నుంచి కుటుంబంతో వచ్చిన పూజా ఝా మాట్లాడుతూ, మాఘ మేళాలో ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

మొదటి రోజు కావడంతో జనసందోహం తక్కువగా ఉండటంతో ప్రశాంతంగా స్నానం చేయగలిగామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని రేవా నుంచి వచ్చిన శివానీ మిశ్రా మాట్లాడుతూ మహా కుంభమేళాలో మూడుసార్లు స్నానం చేశానని, మాఘ మేళాలో తక్కువగా భక్తులు ఉండటం వల్ల మరింత ప్రశాంత అనుభూతి కలిగిందని తెలిపారు.

అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (మాఘ మేళా) దయానంద్ ప్రసాద్ మాట్లాడుతూ ఈసారి తొలిసారిగా కల్పవాసీల కోసం ప్రత్యేక టౌన్‌షిప్ ఏర్పాటు చేశామని తెలిపారు. 950 బీఘాల(ఎకరాలు) విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ టౌన్‌షిప్‌కు ‘ప్రయాగ్‌వాల్’ అని పేరు పెట్టారు. ఇది నాగవాసుకి ఆలయానికి ఎదురుగా ఉంది.

మాఘ మేళా 2026లో ముఖ్య స్నాన ఘట్టాలు

మకర సంక్రాంతి – జనవరి 14, మౌని అమావాస్య – జనవరి 18, వసంత పంచమి – జనవరి 23, మాఘ పౌర్ణమి – ఫిబ్రవరి 1, మహాశివరాత్రి – ఫిబ్రవరి 15