Let's talk: editor@tmv.in
ప్రయాగ్‌రాజ్‌లో ఐఏఎఫ్ విమానం అత్యవసర ల్యాండింగ్

ప్రయాగ్‌రాజ్‌లో ఐఏఎఫ్ విమానం అత్యవసర ల్యాండింగ్

Pinjari Chand
22 జనవరి, 2026

సాంకేతిక లోపం తలెత్తడంతో భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన రెండు సీట్ల మైక్రోలైట్ విమానం బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనావాసం లేని ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై కారణాలు తెలుసుకునేందుకు కోర్ట్ ఆఫ్ ఇన్క్వైరీ (విచారణ కమిటీ) ఏర్పాటు చేసినట్లు ఐఏఎఫ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో తెలిపింది. సాధారణ రూటిన్ సార్టీ సందర్భంగా బమ్రౌలి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన మైక్రోలైట్ విమానం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే రికవరీ సిస్టమ్‌ను ప్రారంభించి, పౌరులకు లేదా ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా విమానాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఐఏఎఫ్ వెల్లడించింది.

మైక్రోలైట్ విమానాలను సాధారణంగా శిక్షణ, పక్షుల కదలికల పరిశీలన (బర్డ్ రికీ), సర్వే అవసరాల కోసం వినియోగిస్తారు. ప్రయాగ్‌రాజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సిటీ) మణీశ్ శాండిల్యా తెలిపిన వివరాల ప్రకారం, విమానం ఫఫామౌ, సంగం ప్రాంతాల వైపు వెళ్తున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో జార్జ్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీ కాలేజీ సమీపంలోని ఒక కొలను వద్ద పూర్తి కంట్రోల్ తో ల్యాండింగ్ చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహకారంతో పైలట్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో డైవర్లు కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఘటన స్థలంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రయాగ్‌రాజ్‌లో ఐఏఎఫ్ విమానం అత్యవసర ల్యాండింగ్ - Tholi Paluku