Let's talk: editor@tmv.in
ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి: డిప్యూటీ సీఎం

ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి: డిప్యూటీ సీఎం

Panthagani Anusha
11 డిసెంబర్, 2025

రాష్ట్రంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పారదర్శక పదోన్నతుల ప్రక్రియ ద్వారా ఉద్యోగుల సందడి ఇంటింటా కనిపిస్తున్నప్పటికీ అదే ఆనందం ప్రజలకు అందించే సేవల్లో ప్రతిఫలించాలని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో బుధవారం ఈ శాఖల అధికారులు, సిబ్బందితో నిర్వహించిన ‘మాటామంతి’ కార్యక్రమంలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పదోన్నతి అంటే ఉద్యోగి ఇంట్లో పండుగ

ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా మీ కష్టాలు నాకు తెలుసు. పదోన్నతి అంటే ఇంట్లో పండుగ వాతావరణం. అందుకే ఈ శాఖలో ప్రమోషన్ల వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా మార్చాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వంలో బదిలీలు, ప్రమోషన్లకు రేటు కార్డులు ఉండాలని, తాము సీనియారిటీ–సిన్సియారిటీ ఆధారంగా మాత్రమే పదోన్నతులు ఇచ్చామని స్పష్టం చేశారు. ఉద్యోగులు నిష్పాక్షికంగా పని చేస్తేనే ప్రజలకు సేవలు సకాలంలో అందుతాయని హెచ్చరించారు. “నేను జవాబుదారీగా ఉంటాను… కానీ మీరు తప్పు చేయకూడదు” అని తెలిపారు.

10 వేల మందికి పైగా పదోన్నతులు

ఏడాదిన్నర పాలనలోనే పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖల్లో 10 వేల మంది పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ఇదే మొదటిసారి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇంత భారీ స్థాయిలో ప్రమోషన్లు ఎన్నడూ లేవని ఆయన పేర్కొన్నారు.

జిల్లా పరిషత్ సీఈవో స్థాయిలో కూడా తొలిసారి 70 మందికి ప్రమోషన్లు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఈ.ఎన్.సీ. స్థాయికి కూడా రెగ్యులర్ ప్రమోషన్లు అందిస్తున్నట్టు తెలిపారు.

పల్లెల బాగుపై దృష్టి… రూర్బన్ పంచాయతీల అమలు

“పల్లెలు బాగుంటే దేశం బాగుంటుంది” అన్న నినాదంతో పంచాయతీరాజ్ శాఖను ఎంచుకున్నానని పవన్ తెలిపారు. 13,350 పంచాయతీలను స్వతంత్ర పాలనా యూనిట్లుగా మార్చి, క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసిన వివరాలను వెల్లడించారు. గ్రామ కార్యదర్శిని ‘విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్’గా మార్చి ప్రతి పంచాయతీకి ప్రత్యేకాధికారిని నియమించామని చెప్పారు. 10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా గుర్తించి పట్టణాల తరహాలో అభివృద్ధి జరిపేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

77 డీడీఓ కార్యాలయాలు – గ్రామ స్థాయిలో బలమైన పాలన

73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో గ్రామ స్థాయిలో పాలనను బలోపేతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో ఎంపీడీఓ కార్యాలయంలో పాక్షికంగా పనిచేసే అధికారులు ఇప్పుడు ప్రత్యేక కార్యాలయాల ద్వారా పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నారని వివరించారు. దీని వల్ల పౌర సేవలు గ్రామస్థాయిలోనే సులభతరం అవుతున్నాయని తెలిపారు.

ఉద్యోగుల భద్రతకు హామీ – మహిళలపై వేధింపులకు కఠిన చర్యలు

ఉద్యోగుల భద్రతను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విధుల్లో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వమే అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళా ఉద్యోగులను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అన్నారు. గాలివీడు ఎంపీడీఓ ఆల్ఫ్రెడ్ జవహర్ బాబు‌పై దాడి జరిగినప్పుడు స్వయంగా వెళ్లి అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు.

ఆర్థిక వ్యవస్థ గాడిన పడితేనే అధిక ప్రయోజనాలు

ఆర్థిక వ్యవస్థ బలపడాలి. అప్పుడు ఉద్యోగుల మరిన్ని ఆకాంక్షలు తీరుతాయి. ఒక్కరోజులో అన్నీ సాధ్యం కాదు అని పవన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంస్కరణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

పంచాయతీరాజ్ , ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాలు ఒకటిగా పనిచేసి ప్రజలకు సేవల్లో నిష్పక్షపాతంగా ఉండాలని పవన్ సూచించారు. ప్రజల కోసం మీరు కృషి చేయండి పారదర్శక పరిపాలన కోసం నేను మీకు అండగా ఉంటా అని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, శిక్షణా సంస్థ కమిషనర్ ముత్యాలరాజు, గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎంఎన్‌ఆరెగ్యాస్ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్, ఇంజినీరింగ్ చీఫ్‌లు బాలూనాయక్, గాయత్రిదేవి తదితరులు పాల్గొన్నారు.

ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి: డిప్యూటీ సీఎం - Tholi Paluku