Let's talk: editor@tmv.in
ప్రమోద్ భగత్‌ ‘ట్రిపుల్ గోల్డ్‌’

ప్రమోద్ భగత్‌ ‘ట్రిపుల్ గోల్డ్‌’

Shaik Mohammad Shaffee
7 అక్టోబర్, 2025

భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, టోక్యో పారాలింపిక్స్ స్వర్ణ విజేత ప్రమోద్ భగత్ తొలి ఆబియా పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో తన అసాధారణమైన ఫామ్‌ను కొనసాగించి ఏకంగా మూడు స్వర్ణ పతకాలతో మెరిశారు. సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 5 వరకు ఆబియాలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ పారా బ్యాడ్మింటన్ సర్క్యూట్‌లో తన ఆధిపత్యాన్ని ప్రమోద్ మరోసారి చాటుకున్నారు.

మూడు విభాగాల్లో పసిడి మెరుపు

ప్రమోద్ భగత్ ఈ టోర్నమెంట్‌లో మొత్తం మూడు విభాగాలలో‍ మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీపడ్డారు. ఈ మూడింటిలోనూ ఫైనల్స్‌కు చేరి, అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచారు.

పురుషుల సింగిల్స్: ఫైనల్‌లో స్వదేశీయుడైన మంతు కుమార్‌పై 21-7, 9-21, 21-9 తేడాతో గట్టి పోరాటం చేసి ప్రమోద్ విజయం సాధించారు. రెండో గేమ్‌ను కోల్పోయినప్పటికీ, తనదైన చురుకుదనం, వ్యూహాత్మక నైపుణ్యాలతో తిరిగి పుంజుకుని మ్యాచ్‌ను ముగించారు.

డబుల్స్‌లోనూ హ్యాట్రిక్: సుకాంత్ కదమ్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లోనూ ప్రమోద్ భగత్ స్వర్ణ పతకాన్ని సాధించారు. ఫైనల్‌లో పెరూకు చెందిన గెర్సన్ జైర్ వర్గాస్ లోస్టౌనౌల్, డయానా రోజాస్ గొలాక్‌లను స్ట్రయిట్ గేమ్‌లలో 21-13, 21-17 తేడాతో ఓడించారు.

మిక్స్‌డ్ డబుల్స్: ప్రమోద్ భగత్ సాధించిన మూడో టైటిల్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగానికి చెందినది. ఆరతి పాటిల్‌తో జతకట్టిన ప్రమోద్, ఫైనల్‌లో ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా పూర్తి నియంత్రణతో ఆడి విజయాన్ని అందుకున్నారు. ఈ విభాగంలో పసిడి గెలవడం ద్వారా ప్రమోద్ భగత్ 'ట్రిపుల్ గోల్డ్' పతకాలతో టోర్నమెంట్‌లో అత్యధిక వ్యక్తిగత పతకాలు సాధించిన క్రీడాకారుడిగా నిలిచారు.

ఈ అద్భుతమైన విజయం పట్ల ప్రమోద్ భగత్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం రాబోయే అంతర్జాతీయ టోర్నీలు, ముఖ్యంగా పారాలింపిక్ క్రీడలకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. తన ఫిట్‌నెస్‌, నైపుణ్యంపై మరింత దృష్టి పెట్టి, శిక్షణలో కఠోర సాధన చేశానని, దాని ఫలితమే ఈ విజయం అని అన్నారు. తన కోచ్‌లు, సహచరుల మద్దతు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని వారికి కృతజ్ఞతలు తెలిపారు.

భారత్ కు పతకాల పంట

ప్రమోద్ భగత్ అద్భుత ప్రదర్శనతో పాటు అనేక మంది భారతీయ షట్లర్లు ఈ టోర్నీలో ఆకట్టుకున్నారు. మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో రంజిత్ సింగ్ మూడు కాంస్య పతకాలతో మెరిశారు. నూరుల్ హుస్సేన్ ఖాన్ పురుషుల సింగిల్స్‌లో రజతం సాధించారు. ఉమా సర్కార్ మహిళల సింగిల్స్ విభాగంలో రజతం సాధించింది. ఉమా సర్కార్, ఆరతి పాటిల్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్యాన్ని దక్కించుకుంది. నిలేష్ గైక్వాడ్, కనక్ సింగ్ జదౌన్ కాంస్యాలు సాధించారు. ముఖ్యంగా పురుషుల సింగిల్స్ విభాగంలో భారతదేశం క్లీన్ స్వీప్ చేసింది. ఇందులో కరణ్ పనీర్ స్వర్ణం, రాహుల్ విమల్ రజతం, సతివాడ కాంస్యం గెలుచుకున్నారు.