
ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత
పశ్చిమ కనుమల (వెస్ట్రన్ ఘాట్స్) పరిరక్షణకు విశేష కృషి చేసిన ప్రముఖ పర్యావరణవేత్త డా. మాధవ్ గాడ్గిల్ (83) కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యంతో పుణెలోని ఓ ఆసుపత్రిలో బుధవారం అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. భారతదేశ పర్యావరణ పరిశోధన, సంరక్షణ విధానాల రూపకల్పనలో డా. గాడ్గిల్ కీలక, మార్గదర్శక పాత్ర పోషించారు. ఆయన బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్సీ)లోని సెంటర్ ఫర్ ఎకాలజికల్ సైన్సెస్ స్థాపకుడు కాగా, పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీకి (వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ – డబ్ల్యూజీఈఈపీ) ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఈ కమిటీనే సాధారణంగా ‘గాడ్గిల్ కమిషన్’గా పిలుస్తారు. పశ్చిమ కనుమలలో పెరుగుతున్న జనాభా ఒత్తిడి, వాతావరణ మార్పులు, అభివృద్ధి కార్యకలాపాలు పర్యావరణంపై చూపుతున్న ప్రభావాలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2010లో గాడ్గిల్‌ను కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీ సమర్పించిన నివేదికలో పశ్చిమ కనుమలలోని పెద్ద భాగాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా (ఎకాలజికల్ సెన్సిటివ్ జోన్) ప్రకటించాలని సూచించారు. ఈ నివేదిక దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసినప్పటికీ, భారత పర్యావరణ ఆలోచనా విధానంలో ఇది ఒక మైలురాయిగా భావించబడుతోంది.
జీవితాంతం పరిశోధనల్లోనే
1942 మే 24న పుణెలో జన్మించిన మాధవ్ గాడ్గిల్ ప్రతిష్టాత్మక విద్యావంతుల కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి ధనంజయ్ రామ్‌చంద్ర గాడ్గిల్ ప్రముఖ ఆర్థికవేత్త కాగా, గోఖలే ఇన్‌స్టిట్యూట్ కు డైరెక్టర్‌గా సేవలందించారు. డా. గాడ్గిల్ 1963లో ఫెర్గూసన్ కాలేజీ నుంచి జీవశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం 1965లో ముంబయి విశ్వవిద్యాలయం నుంచి జవాలాజీ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. 1969లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గణిత పర్యావరణ శాస్త్రం, జంతు ప్రవర్తన అంశాలపై పీహెచ్‌డీ సాధించారు. 1971లో భారత్‌కు తిరిగొచ్చిన ఆయన, 1973లో భారతీయ విజ్ఞాన సంస్థలో చేరారు. ఐఐఎస్సీలో పనిచేసే సమయంలో సెంటర్ ఫర్ ఎకాలజికల్ సైన్సెస్, సెంటర్ ఫర్ థియోరెటికల్ స్టడీస్ వంటి కీలక పరిశోధనా సంస్థలను స్థాపించి, దేశంలో ఆధునిక పర్యావరణ పరిశోధనకు పునాదులు వేశారు. 2004లో ఐఐఎస్సీ నుంచి పదవీ విరమణ చేసిన అనంతరం కూడా ఆయన విద్యా, పరిశోధనా రంగాలను విడిచిపెట్టలేదు. పుణెలోని అగార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, గోవా విశ్వవిద్యాలయంతో అనుబంధంగా పరిశోధన, బోధన కొనసాగించారు.
‘చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్’ తో ఐరాస సత్కారం
డా. గాడ్గిల్ ప్రధాని శాస్త్రీయ సలహా మండలి, జాతీయ సలహా మండలి, జాతీయ పులుల సంరక్షణ అధికారం వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో సభ్యుడిగా సేవలందించారు. ఉత్పాదక పరిశోధకుడిగా పేరొందిన ఆయన ‘దిస్ ఫిషర్డ్ ల్యాండ్’, ‘ఎకాలజీ అండ్ ఈక్విటీ’ వంటి ప్రభావవంతమైన పుస్తకాలను రచించారు. 250కి పైగా శాస్త్రీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. పర్యావరణ అవగాహన పెంపొందించేందుకు ఇంగ్లిష్, మరాఠీ భాషల్లో కాలమ్స్ కూడా రాశారు. డా. మాధవ్ గాడ్గిల్ సేవలకు గాను ఆయనకు పద్మశ్రీ (1981), పద్మభూషణ్ (2006), శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, వోల్వో ఎన్విరాన్‌మెంట్ ప్రైజ్, టైలర్ పర్యావరణ అవార్డు వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు లభించాయి. 2024లో ఐక్యరాజ్యసమితి ఆయనకు ‘చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్’ అవార్డును ప్రదానం చేసింది. ఇది ఐక్యరాజ్యసమితి అందించే అత్యున్నత పర్యావరణ గౌరవంగా గుర్తింపు పొందింది.
పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్‌కు కాంగ్రెస్ నివాళులు
ప్రముఖ భారతీయ పర్యావరణవేత్త డా. మాధవ్ గాడ్గిల్ మృతి చెందడంతో, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. ప్రకృతి, సామాజిక న్యాయానికి అంకితమైన కరుణామయ స్వరంగా ఆయనను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో స్పందిస్తూ, డా. మాధవ్ గాడ్గిల్ జీవితకాల కృషి తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా డా. గాడ్గిల్ మృతిపై సంతాపం ప్రకటించారు. భారతదేశ పర్యావరణ పరిశోధన రంగంలో ఆయన అగ్రగామిగా నిలిచారని పేర్కొన్నారు. పశ్చిమ కనుమలపై ఆయన చేసిన మార్గదర్శక పరిశోధనలు, ప్రకృతి పరిరక్షణ విధానాల రూపకల్పనలో ఆయన పాత్ర, స్థానిక సమాజ హక్కుల రక్షణకు చేసిన కృషిని ఖర్గే ప్రత్యేకంగా ప్రస్తావించారు. డా. మాధవ్ గాడ్గిల్ మృతితో భారతదేశం పర్యావరణ పరిశోధనలో ఒక గొప్ప స్వరాన్ని కోల్పోయింది. శాస్త్రీయ ఆధారాలను విధానాలుగా మార్చడంలో ఆయన నాయకత్వం కీలకంగా నిలిచిందని ఎక్స్ పోస్టులో తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కూడా డా. గాడ్గిల్‌కు నివాళులు అర్పిస్తూ, ఆయనను ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్తగా, నిర్విరామ క్షేత్ర పరిశోధకుడిగా, అనేక తరాల విద్యార్థులకు మార్గదర్శకుడిగా అభివర్ణించారు. సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం (1970ల చివరి దశ–1980ల ప్రారంభం), బస్తర్ అడవుల పరిరక్షణ (1980ల మధ్యకాలం), 2009–2011 మధ్య పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ (వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్‌పర్ట్ ప్యానెల్)కు ఛైర్మన్‌గా వ్యవహరించడం వంటి అనేక కీలక పర్యావరణ ఉద్యమాల్లో డా. గాడ్గిల్ కీలక పాత్ర పోషించారు. ఆ కమిటీ నివేదిక లోతైన విశ్లేషణతో పాటు ప్రజాస్వామ్య దృక్పథానికి నిదర్శనంగా నిలిచిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. డా. మాధవ్ గాడ్గిల్ మృతి భారతదేశ పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటుగా పలువురు పేర్కొన్నారు.
