Let's talk: editor@tmv.in
ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత

ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత

Gaddamidi Naveen
28 ఆగస్టు, 2026

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు (73) గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. బుధవారం రాత్రి ఇకలేరనే విషాదకర వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు ఆగస్టు 28న (నేడు) హైదరాబాద్‌లోని వైకుంఠ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

కె. బాలచందర్ దర్శకత్వంలో 1976లో వచ్చిన ‘అంతులేని కథ’ చిత్రంతో నారాయణరావు వెండితెరకు పరిచయం. చిరంజీవి, రజనీకాంత్‌ల సమకాలీనుడైన ఆయన సుమారు 100 సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో నటించారు. ‘చిలకమ్మ చెప్పింది’, ‘ముత్యాల పల్లకి’, చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. ‘పసుపు కుంకుమ’, ‘సుందరకాండ’ వంటి ప్రముఖ సీరియళ్లలోనూ ఆయన నటించారు. నారాయణరావు మృతిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నారాయణరావుకు ఒక కుమారుడు, కుమార్తె. ప్రస్తుతం ఇద్దరూ విదేశాల్లో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం మాత్రం గుంతకల్లులో సాగింది.